ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

33

న: ఈ సంగతి మాట్లాడడానికే రేపు రాజుగా రిటు వేటకు వస్తారు. ముందుగా విన్నవించడానికి మమ్మును బంపారు.

నా : అయ్యా ! వింటున్నావుగద, సంగతులన్నీ ! ఏమంటావు ?

రా : నీవు మంత్రైనంతమాత్రంచేత లాభంలేదు. వారంతా అక్షరాలా నీవు చెప్పినట్టు నడవడానికి వొప్పుకుంటే అంగీకరించవచ్చు. రాజుగారికి యీ షరతులు వైనంగా జెప్పు. వొప్పుకుంటేనే ఆయెను.

నా : ఇంతపని నావల్ల అవుతుందా ?

రా : అయితే నీవల్లనే కావాలె. మాచర్ల మనదయ్యేవరకు ఎత్తినకత్తి దించనని దీక్ష,బెట్టుకో. అది నెరవేరిన వుత్తరక్షణం వైదొలగి నీ పొలమూ, పశువులూ చూచుకో.

నా : నాకు పశువులసేవ పశుపతిసేవకంటేగూడ ప్రియతరము. రాజ్యభారనిర్వహణ మతిదుష్కరం.

రా: ఎల్లకాలం ని న్నీ భారం మోయమనడంలేదుగా. సమయం గాని సమయాలు వచ్చినప్పుడు మామూలు ప్రకారం పోదామంటే వీలుగాదు.

నా: రాజుగారు ఈ షరతుల కంగీకరిస్తారా ?

న : మే మడిగిన వొక్కషరతు తమరు అంగీకరిస్తే తక్కిన షరతు లెన్నైనా వా రంగీకరిస్తారు.

నా : సరే. అన్నీ వారి సమక్షములోనే మాట్లాడుదాం. రేపేవేళకు వస్తారు ?

కే: ఇదే వేళకు వస్తారు.

నా : చిత్తం. అకాలమయింది. శివపూజకు లేవండి.

(నిష్క్రమణం, తెరబడుతుంది.)