ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

నాయకురాలు

నా : కత్తి అన్నిహక్కులు కలుగజేస్తుంది.

న : మలిదేవునియందు బ్రహ్మనాయుడి కత్యంతమయిన ప్రేమ.

నా : అవును, తోడేలుకు మేకపోతుమీదా అటువంటిప్రేమే వుంటుంది.

కే : నాయుడు అట్టి క్రూరకృత్యాలకు లోబడడని నా మనవి.

నా : ఆయన పూర్వచరిత్ర మీకు దెలియదు. ఒక చిన్న దృష్టాంతం జెపుతాను. ఈ మధ్యనే లేక లేక పుట్టిన కొడుకును యెవడో తండ్రిగండ మున్నదని చెప్పితే నరకడానికి అడవికి బంపించాడు. అన్నగారు దయదలచి పిల్లవాడిని దాచిపెడితే ఆయనమీద కక్ష సాధిస్తున్నాడు. ఆయన స్వార్థపరత్వానికీ, కౌర్యానికీ యింతకంటె యేమి దృష్టాంతము కావాలి?

న; శివ, శివ ! పాపము శమించుగాక.

నా : పాపము దానెంతటది శమించదు. గట్టి ప్రయత్నం జెయ్యాలె.

కే : అంతవరకు నిశ్చయమే.

నా : మరి మీరంతా యేమి యోచించారు ?

న : మనది మంత్రిలేని రాజ్యం. ఆ పదవి తమరు స్వీకరించాలె.

నా : నాకే పంత్రిపదవి !

న : తమరు స్వీకరించక తప్పదు. తమరు చుక్కానిదగ్గర నిలవంది పడవ గట్టు జేరదు. ఇది రాజుగారి నిశ్చితాభిప్రాయంకూడాను.

నా : ఏమో ! ఇది నావల్ల కాదగినపని గాదు.

కే : మీరు కారణజన్ములు. ఈ పని మరివొకరివల్ల గాదు.