ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

నాయకురాలు

1-వ రంగము

పల్నాటి సరిహద్దులు

[మ. దే. రా., బ్రహ్మ.. కొమ్మ, బా. చం., క. దా,, అ. రా. మొదలైనవారు. ప్రవేశము ]

బ్రహ్మ : ఇదే, పల్నాటి సరిహద్దు దాటుతున్నాం. ఏడేండ్లకు సెలవుగా జన్మభూమి మళ్లీ తొక్కుతున్నాం. అంతా పల్నాటిమాతకు సాష్టాంగనమస్కారం చెయ్యండి. ( నమస్కారము చేసి లేచి) ఆహా ! మన లంకన్న లేకపోయెగదా! వుంటే యెంత ఆనందపడేవాడు ! మనతో కష్టములలో పాల్గొన్నాడుగాని, సంతోషములో భాగస్వామి కావడానికి ప్రాప్తం లేకపోయింది.

మ. దే. రా : అమ్మా, పల్నాటిసీమా, నీ ప్రియపుత్రుడయిన లంకన్నను మింగి వచ్చాం.

బా. చం : రాబోయే రణయజ్ఞములో లంకన్నకు బదులుగా మమ్మును ఇంధనములుగా ఉపయోగించండి.

క. దా : సంతోషచిహ్నముగా మనమందరమూ యిక్కడ విడిసి పల్నాటిమాతకు చద్దీ, వేడీ వేడిపెట్టుకొందాము. ఆవులకు అలంకారాలు చేయింతాము.

బ్రహ్మ : ఇవ్వాళ పొంగలిపండుగ, రేపు ఆవులపండుగ, కానియ్యండి. ఇంకాముందుకు సాగకపూర్వం గడువు పూర్తిఅయిందనీ, మాచర్ల మా కియ్యవలసినదనీ సమాచారం పంపి జవాబు తెప్పించు కొందాము. బదులువుత్తరం వచ్చేవరకూ యిక్కడనే ఉత్సవాలు చేసుకొంటూ వుందాము.