పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటక ప్రయోజనము విలాసమా, విజ్ఞానమా?


‘కావ్యం యళ స్కేర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే,
సద్యః పరనిర్వృతీయే కాంతాసమ్మితతయో ప దేశయుజే’

—కావ్యప్రకాశము

మా పరిషద్గోష్ఠిలో ఏ నాటకము యొక్క గాని గుణాగుణప్రసంగము వచ్చేటప్పుడు ఏమూలనుండియో 'దీని ప్రయోజన మేమిటి?' అనే ప్రశ్న వస్తూవుంటుంది. వెనువెంటనే దానికి జవాబుగా ‘ప్రయోజన మేమిటి? రామారావు గారి చిత్రములకూ, ఉదయశంకరుని నృత్యమునకూ, నాయుడుగారి ఫిడేలు వాద్యమునకూ ఫలమేమో దీనికీ అదే—ఆనందము' అని వినబడుతుంది. దానికి ప్రత్యాఖ్యానంగా ఇంకొకధ్వని “అట్లా అనడానికి వీలులేదు. కావ్యం వీటి అన్నిటికంటే విశిష్టమైనది. దీనికి కేవలానందముకంటే భిన్నమైన ప్రయోజనముండితీరవలె” అని బయలు వెడలుతుంది. తుదకు పరిషదభిప్రాయము రెండుగా తేలుతూ వుంటుంది. "ఇది ఆద్యంతమూ సంతోషావహంగా వుండడంవల్ల చాలా ఉత్తమ గ్రంధము” అని ఒకటీ—"దీని కింకొక ప్రయోజనమేమీ కానరానందువల్లనూ, దీనిమూలమున దేశమునకుగాని, సంఘమునకుగాని యేవిధమైన లాభమునూ కన్పట్టకపోవుటచేతనూ ఇది అంతగా ప్రశంసింపరానిది" అని ఒకటీ. ఎవరి అభిప్రాయము వారిదేకాని పర్యవసానం లేదు. అయితే నాటక ప్రయోజనమేమో నిర్ధారణగా తేల్చవలెనని మేమందరమూ మాఆచార్యుల వారిని కోరినాము. వా రీసందర్భమున ఒక వ్యాసము వ్రాసి తెచ్చి చదివినారు. వారు చదువుతూవుండగా నడుమనడుమ ఎవరికితోచిన ప్రశ్నలు వా రడుగుతూవచ్చినారు. సమాధానములు సంతృప్తికరముగా నుండెను. ఈవ్యాసచర్చ పూర్తి అయేసరికి నాల్గుగంటలకాలం పట్టింది. కనుక ఆచర్చ అంతా ఎత్తివ్రాయకుండా ఆన్యాసంమాత్రం తమకందజేస్తూవున్నాను. వ్యాసం గ్రాంథిక భాషలో వున్నది—భాష యేదైతే మనకేమి?

వ్యాసం

'కావ్యం ద్వివిధమ్—దృశ్యం శ్రవ్యంచేతి’ అనువచనమున నాటకము కావ్యభేదము. దృశ్యమును తొలుత వాకొనుటచే నాటకమునకే అభ్యర్హి తత్వము. కావుననే 'కావ్యేషు నాటకం రమ్యమ్' అనియు, 'నాటకాంతం కవిత్వమ్' అనియు, ‘నాటకాంతంహి సాహిత్యమ్' అనియు పెద్ద లాడుదురు. వేదములకు, వేదాంతములకు (ఉపనిషత్తులకు గల సంబంధమే కావ్యనాటకములకును గలదు.