ఈ పుట ఆమోదించబడ్డది

కారు. అప్పటికి గోదావరికి కట్టలేదు. అయినా, జనం స్నానపు రేవులు పాడు చెయ్యకుండా కొంతకాలం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించాను. గట్టు నా కాలంలో పడకపోయినా, గోదావరికి ఒక గట్టు వుండాలనీ, దాన్ని సొగసుగా వుంచాలనీ ఒక అభిప్రాయం ప్రచారంచేసి ఆ సిద్ధాంతాన్ని కూడా అంగీకరింపచేశాను. మునిసిపల్ పరిపాలన కొంతకాలం ఎవ్వరి పేచీ లేకుండా సాగిపోయింది.

కాని, కొంతకాలానికి రాయపూడి సుబ్బారాయుడుకీ, నాకూ కంట్రాక్టుల విషయంలో తగాదా వచ్చింది. అతను చిరకాలంనించి ఈ కౌన్సిల్లో వుండి, ఎన్నికలలో కిందా మీదా పడుతూ వుండడంచేత, కొందరి యెడల ప్రత్యేకాభిమానం చూపించేవాడు. నా కా సంబంధాలేమీ లేకుండా ఒక పద్ధతిని పోకపోతే కష్టంగా వుండేది. అంతేకాదు, అతను చెప్పినట్లల్లా చెయ్యకపోతే అతనికి బాధగా వుండేది. అతను "దుర్గయ్యగారిని ఒదులుకుని, నిన్ను తెచ్చిపెట్టుకున్నందుకా ఈ గొడవ అంతా?" అంటూ బాధపడేవాడు. నేను నిర్మొహమాటంగా, "అబ్బాయి! నువ్వు చేసిన సహాయానికి సంతోషమే, కాని ఈ నాలుగు రోజులూ నా స్వాతంత్ర్యానికి భంగం రాకుండా నన్ను ఈ వుద్యోగం చెయ్యనియ్యి!" అని చెప్పాను.

ఇల్లా వుండగా, ప్రతికక్షులు నాకు ఛైర్మన్ ఎలక్షనులో సహాయం చేసిన వాళ్ళమీద ఏదో ఒక తంటా తెచ్చి కక్ష సాధించడానికి పూనుకున్నారు. ఆరాముదయ్యంగారు నా పార్టీలో నాకు బాగా సహాయంగా వుండేవాడు. ఆయన ఆలపాటి భాస్కర రామయ్యగారితో వ్యాపారం చేసి విడిపోయేటప్పుడు సామానులు పంచుకుని పట్టుకుపోవడంలో రెండు తీగెలకట్టలు కూడా పట్టుకు వెళ్ళాడు. అందుకని కక్షకట్టి ఆయనమీద దొంగతనం నేరం ఆరోపించారు. ఆ కేసులో ఫిర్యాదీ తరపున అచ్యుత రామయ్యగారు, ముద్దాయి తరపున నేను వాదించాము. మేజస్ట్రీటు జిళ్ళేళ్ళ కృష్ణారావు పంతులుగారు. ఆయన దేవాంతకపు మేజస్ట్రీటు, ఈ కేసు సుమారు ఐదారు నెలలు విచారించాడు. ఈ విషయంలో ఆరాముదయ్యంగారి అన్నగారు పి. టి. శ్రీనివాసయ్యంగారు