ఈ పుట ఆమోదించబడ్డది

పనిచెయ్యడంలో తప్పేమిటి?" అని అడిగాను. చివరికి, "ఆకుకీ పోకకీ అందని కబుర్లమీద ఆధారపడి, న్యాయపరీక్షకి నిలబడని కథలు ఆధారంచేసుకుని, శాస్త్రోక్తంగా జరిగిన ఎన్నిక రద్దుచెయ్యడానికి మీకు ఏమి అధికారం ఉన్న?" దని అడిగాను. ఆ సంభాషణలో ఉభయులమూ చురుగ్గానే మాట్లాడుకున్నాము. చివరికి ఆయన, "సరే జాగ్రత్తగా చూస్తా" నన్నాడు.

ఆ తరవాత గవర్నరుగా ఉన్న ఆంస్టర్‌ని కూడా చూశాను. ఆయనతో విషయాలన్నీ చెప్పాను. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి "ప్రకాశంగారూ! మీరు చెప్పిన విషయాల్నిబట్టి చూస్తే, నా ప్రభుత్వం మీ ఎన్నిక రద్దుచేసేటంత గుడ్డిగా వుండదు అనుకుంటాను. అయినా, అది నాకు సంబంధించినదీ, నేను కలగజేసుకునేదీ కాదు. ఫోర్‌బ్సు జాగ్రత్తగానే చూస్తా డనుకుంటాను. అయినా, అంతగా విషమిస్తే చూద్దాం లెండి!" అన్నాడు.

ఈలోగానే రాజమహేంద్రవరంలో పంతులుగారి వర్గం నా ఎన్నిక రద్దయిపోయిం దని పుకారు పుట్టించారు.

ఫోర్బ్సు వెంటనే కాగితాలు తెప్పించి, కలెక్టరు రిపోర్టు చూసి, నాతో మాట్లాడిన మాటలు మనస్సులో వుంచుకుని, వెంటనే ఇల్లాగ ఆర్డరు పాస్ చేశాడు. "He is certainly a troublesome man. But we cannot avoid him. Gazette his name." దాని మీద నా పేరు గెజెట్ అయి నేను ఛార్జీ పుచ్చుకున్నాను.

ఈ ఛైర్మన్ ఎన్నిక అయిన తరవాత సుబ్బారావుపంతులుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, సోమయాజులుగారు మొదలయినవాళ్లు నామీద మరింత పట్టుదల వహించారు. కాని, మునిసిపల్ వ్యవహారాల్లో నాజోలికి రాలేకపోయేవారు. నేను మునిసిపల్ పని శక్తివంచన లేకుండా జాగ్రత్తగా చేసేవాణ్ణి. పొద్దున్నే 6 గంటలకే గుఱ్ఱంమీద బయలుదేరి ఊరు నాలుగుమూలలూ తిరిగి చూసేవాణ్ణి. అప్పటి కింత ఊరులేదు సరిగదా, దాని కనుగుణంగానే ఉద్యోగస్థులు కూడా ఎంతోమంది వుండేవారు