ఈ పుట ఆమోదించబడ్డది

vii

గాంధి మహాత్ముడు సహాయనిరాకరణోద్యమం ప్రారంభించిన మీదట, సైమన్ కమీషను భారతదేశం వచ్చినప్పుడు మద్రాసులో పెద్దగా ఆందోళన జరిపారు. ప్రకాశంగారు 144 వ సెక్షను ధిక్కరించి నప్పుడు, బ్రిటిష్ సైనికులు తుపాకులు చూపి ఆయనను సవాల్‌చేయగా, వెంటనే ప్రకాశంగారు తన ఎదురు రొమ్ము చూపి, 'కాల్చుకో'మని ఎదురు సవాల్ చేశారు. దాంతో, ఆ సైనికులు స్తబ్దులై నిలబడిపోయి, ప్రకాశంగారిని ముందుకు పోనిచ్చారు. ఈ నిర్భయతే, ఈ గుండెలు దీసిన బంటు తనమే ప్రకాశంగారి 'ఆంధ్ర కేసరి' బిరుదుకు కారణమయింది. ఆయన దక్షిణ భారత నాయకాగ్రణి అయారు.

మొదట మంత్రిగాను, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముఖ్య మంత్రిగాను ప్రకాశంగారు గురుతర నూతన బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు, ఆయన ఇంకా ఎత్తుగా పెరిగి, అత్యంత సమర్థులు, ప్రజానురంజకులు అయిన కాంగ్రెస్ మంత్రులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి చెన్నరాష్ట్రంలో రాజాజీ మంత్రి వర్గంలో ప్రకాశంగారు, నేనూ మంత్రులం. 1946 లో మరల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ఏర్పడినప్పుడు నేను ముఖ్య మంత్రిగా ఉంటే రాష్ట్రానికి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదనే ఒక అభిప్రాయం వ్యక్తమయింది. నేను ఎంత త్యాగమైనా చేసి ప్రకాశంగారి నాయకత్వాన్నే బలపరుస్తాననీ, ఆయన కోరితే తప్ప నేను ముఖ్య మంత్రిత్వం స్వీకరించననీ, నేను ముఖ్య మంత్రిని కావాలని సూచించిన నాయకులందరికీ ఒక విధమైన కృతజ్ఞతా పూర్వక నమ్ర భావంతో స్పష్టంగా చెప్పాను. అ మాట నిలబెట్టుకుని, నాకు కొన్ని ప్రమాదాలు, కష్టాలూ ఎదురైనా చెదరిపోకుండా నిలబడి, ప్రకాశంగారు నాటి ఉమ్మడి చెన్నరాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నిక అవడానికి సాయపడ్డాను.