పుట:Naajeevitayatrat021599mbp.pdf/897

ఈ పుట ఆమోదించబడ్డది

నేను - దేబర్, శాస్త్రిగారలను చూడ్డానికి స్టేట్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళగా, వారు ఈ విషయంలో నా అభిప్రాయం తెలియజేయ వలసిందని కోరారు.

అందుకు, ప్రకాశంగారితో మీరు మాటాడినట్టు కనిపించదే, అన్నాను.

"లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆయన పెద్దవారయిపోయారు గదా!" అని, ప్రకాశంగారిని త్రోసిపారేశామని ధ్వనించేటట్టు వారు మాట్లాడారు.

అప్పుడు నేను ఇలా చెప్పాను: "మీ మాట ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయాలు మనం చర్చించడంకన్న మీ ఎవరి పలుకుబడీ అనవసరంగా వినియోగించ నక్కరలేకుండా - శాసన సభ్యులకే వారు యధేష్టంగా వ్యవహరించుకొనే అవకాశం వదిలివేయడం అత్యున్నతమైన పద్దతి."

దానికి వారు, "మీరు చెప్పినమాట వాస్తవమే. కాని, మా పార్టీ పెద్దది గనుక మేము ఎవరిదో ఒక పేరు మా సభ్యులకు సూచించాలి గదా!" అన్నారు.

దాని కిలా జవా బిచ్చాను: "ఒక విశ్వాస రాహిత్య తీర్మానం సభలో ఆమోదింపబడినమీదట ప్రకాశంగారి ప్రభుత్వం పతనమయింది. పతనానంతరం, ఈ ఎన్నికలలో ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు, వారితో ఉన్నవారందరూ - నేను ఒక్కణ్ణి తప్ప, తిరిగి ఎన్నికయ్యారు. నాయకత్వం సహజంగా ప్రకాశంగారికి సంక్రమించాలి గదా!"

అందుకు వారు, "ఆయన చాలా పెద్దవారయిపోయారు" అన్నారు. నేను అందుకు ప్రత్యుత్తరంగా, "ఆయన పెద్దవారైతే, పనిచేయడానికి ఆయనతోబాటు చిన్నవారంతా ఉన్నారు కదా! ఒక వేళ, ఆయన పేరు మీరు కాదనదలచుకొంటే, ఆయనతోపాటే ఉప ముఖ్య మంత్రిగా పని చేసిన సంజీవరెడ్డిగారున్నారు గదా! మీరు, నేను ఈ భాగం చర్చించే ముందు, ప్రకాశంగారితో మాట్లాడకుండా మీరు ఏమీ చేయడం మంచిది కాదు," అన్నాను.