పుట:Naajeevitayatrat021599mbp.pdf/894

ఈ పుట ఆమోదించబడ్డది

మాలో ఎవరు ఏ పేరు చెప్పినా ముగ్గురి అంగీకారంపైననే ఆ పేరు గల వ్యక్తిని అభ్యర్థిగా నిర్ణయించాలి. ఏ పేరు విషయంలోనైనా మాలో భేదాభిప్రాయాలు వస్తే, దాని విషయం ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రిగారి సముఖాన చర్చించాలనీ, అక్కడా నిర్ణయం కాకుంటే, ఆ విషయం శాస్త్రిగారి తీర్పుకు వదిలిపెట్టాలని తీర్మానించాము.

1948, 49, 50 లలో ఏయే తెలుగు మంత్రులపై, ప్రకాశంగారు - అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారో, వారిని అభ్యర్థులుగా ఉంచరాదని నేను ప్రతిపాదించాను.

ఆ సంబంధించిన మంత్రులు 1952 ఎన్నికలలో, ఆ ఆరోపణలవల్ల ఓడిపోయి, మూడేండ్లకు పైగా శాసన సభ్యత్వం పోగొట్టుకున్నారు కనుక - ఆ ప్రసక్తి తిరిగి ఇప్పుడు తేవడం కూడదని, కమిటీ సభ్యులేగాక, ఇతర పెద్దలు నలుగురూ ఏకమై అనడంవల్ల నా ప్రతిపాదన వీగిపోయింది.

వారికి ఈ ఎన్నికలలో ప్రయోగించిన క్రొత్త వ్యూహం, దాని పలుకుబడీ ఉపయోగపడి, వారందరూ జయంపొందడమేగాక, యధాతధంగా పెద్ద పెద్ద పదవులు పొందగలిగారు.

జిల్లావారీగా తీసుకొని మేము 60, 70 శాతం అభ్యర్థులను బెజవాడలోనే నిర్ణయించగలిగాము. వివాదాస్పదమైన అభ్యర్థుల విషయం నిర్ణయించడానికి అనుకున్నట్టుగానే ఢిల్లీ వెళ్ళాము. అది విపరీతమైన చలికాలము. ఢిల్లీలో శాస్త్రిగారి భవనంలో పగలు కొంతసేపు, రాత్రి కొంతసేపు చర్చలు జరిపాము.

అక్కడ చర్చలు జరుగుతుండగా, కాంగ్రెసు పక్షం పేర్లు రెండు విధాలుగా ఉన్నట్టుగా మాకు కనిపించాయి. వారిలో కొందరు గోపాలరెడ్డిగారి పలుకుబడివల్ల, కొందరు సంజీవరెడ్డిగారి పలుకుబడివల్ల ముందుకు త్రోసుకు వస్తున్నట్టు మాకు కనిపించింది.

రంగాగారి పార్టీవారు తమ అభ్యర్థుల పేర్లను చెపుతున్నప్పుడు, గోపాలరెడ్డిగారు తమ అభ్యర్థుల పేర్లను చెపుతున్నప్పుడు ఒకరి నొకరు హెచ్చుగా మద్దతు చేసుకుంటున్నట్టు పైకి కనిపించేది.