పుట:Naajeevitayatrat021599mbp.pdf/882

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వంపై తాము తేగలిగిన విశ్వాసరాహిత్య తీర్మాన వ్యామోహము బలీయమైనది.

చివరికి, 1954 అక్టోబరు చివరలో రెండు విశ్వాస రాహిత్య తీర్మానాలు ప్రతిపాదిస్తామని నోటీసిచ్చారు.

ఆ తీర్మానాలలో ఒకటి యిలా ఉన్నది: "ఈ ప్రభుత్వంలో విధాన సభకు విశ్వాసం లేదు." రెండవ తీర్మానం ఇలా ఉన్నది: "మద్య నిషేధంగూర్చి, రామమూర్తి సంఘం చేసిన సిఫార్సులను అమలు జరపకపోవడంచేత, ఈ ప్రభుత్వంలో విధాన సభకు విశ్వాసం లేదు."

ఇదివరకు ఒక సందర్భంలో, విధాన సభ చర్చలో ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు, ఆ విషయం ఆమోదింపబడడమో, తిరస్కరింపబడడమో, వాయిదా వేయబడడమో - ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగితేకాని, మరొక విషయం ప్రతిపాదించడానికి వీలు లేదని వ్రాశాను.

చర్చించే విషయానికి సంబంధించిన మరేదైనా అది దానికి సవరణగా చర్చకు తేవచ్చును. కాని, ప్రత్యేక విషయంగా సభ ముందుకు తేవడానికి వీలులేదు. ఈ నిబంధనలు చాలా అనుభవంపైన ఏర్పాటు చేసినవి.

అ రోజున, స్పీకరుగారు - ముందు వెనుకగా నిర్ణయాలు చేసే వారన్న విషయం ప్రతిపక్షంవారు గ్రహించి, మీద చెప్పిన రెండు తీర్మానాలూ ప్రతిపాదిస్తా మని పట్టుబట్టారు.

రెండూ - ఒకే పర్యాయం, ఒకదానికి రెండోది సవరణగా తప్ప, రెండు ప్రత్యేక ప్రతిపాదనలుగా చేయకూడదన్న అభ్యంతరం నేను ఎంత గట్టిగా చెప్పినా, స్పీకరు మామూలు పద్ధతిని, "ఏదో సంసార పక్షాన పోదాము. వోటింగు సమయంలో ఈ విషయం చూసుకొందాము లెండి" అని రెండింటిమీద ప్రత్యేక తీర్మానాలుగా చర్చ చేసుకోవచ్చు అని తన నిర్ణయం తెలిపారు.