పుట:Naajeevitayatrat021599mbp.pdf/868

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ తర్వాత రానున్న ఫసలీనుంచి అమలులోకి వచ్చేటట్టుగా పది రూపాయలకన్న తక్కువ భూమిసిస్తు చెల్లించేవారి సిస్తు రద్దు చేశాము. ఆంధ్రా యూనివర్శిటీకి, వారు ప్రత్యేకంగా కోరకుండానే ఏటేటా ఇవ్వవలసిన గ్రాంటు అప్పటికున్నదానికన్న లక్షరూపాయలు పెంచాము.

కర్నూలులో ఆంధ్రప్రభుత్వం రాజ్యంచేస్తున్న కాలంలో - కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఉత్పాదన సుంకాల వంతూ, అలాగే ఆదాయపు పన్ను (ఎస్టేటు డ్యూటీ) లో వంతూ, సంపత్తి శుల్కంలో ఇచ్చే భాగంలో కలిపి మొత్తం రాబడి ఇరవైకోట్లకన్నా తక్కువగా ఉండేది.

విదేశాలనుంచి ఋణాలప్రవాహం అప్పటికి పెల్లుబికి రావడం ప్రారంభించలేదు. భూమి సిస్తుకూడా అప్పుడు 5 కోట్లకన్నా తక్కువగా వుండేది. ఇటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద మొత్తాలు అవసరమయ్యే పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించడానికి అవకాశం తక్కువగా వుండేది.

చెన్నరాష్ట్రంవారు - గోదావరి, కృష్ణా, పెన్నారు ప్రాజెక్టులు కట్టడానికి ఉమ్మడిరాష్ట్రంవారు చేసిన ఋణం మొత్తం, ఆ ప్రాజెక్టుల వల్ల వచ్చిన డబ్బులోంచి చెల్లించక, ఆ ఋణం మొత్తాలు ఆంధ్రదేశం చెల్లించవలసిన పబ్లిక్ డెట్ (లోక ఋణం) గా చూపించారు. ఆ ప్రాజెక్టులవల్ల వచ్చిన రాబడి - ఖర్చులు, వడ్డీలు పోను మిగులు 30 కోట్ల రూపాయలున్న, అది మన రాష్ట్రానికి ఆస్తిక్రింద ఇవ్వము అని తీర్మానించారు.

అందుచేత, రాష్ట్ర విభజన నాటికి మన రాష్ట్రానికి 33 కోట్ల పబ్లిక్ ఋణం తగులుకుంది

ఇటువంటి ఆర్థిక స్థితిలో మనరాష్ట్రం ఆరంభమైంది. అయినప్పటికీ, అందులోనుంచే సంవత్సరానికి 60 లక్షల రూపాయల చొప్పున కేటాయించి, క్షామ నివారణ నిధి పెంపుదలకు ఏర్పాటు చేశాము.

దురదృష్టంకొద్దీ, ప్రారంభించిన సంవత్సరంలోనే, విశాఖ