పుట:Naajeevitayatrat021599mbp.pdf/858

ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి సంబంధించిన కాగితాలు తమదగ్గరే ఉంచుకొని, ఏదో చల్లటి స్థలానికి వెళ్ళిపోయారని - తమకు తెలిసిన భోగట్టా చెప్పారు.

ఆ చల్లటి స్థలంనుంచి ఆయన సిఫారసు పంపిస్తారో, పంపించరో అన్న అనుమానం కలిగి, రాష్ట్రపతిగారు ఆ ఫైలుమీద తమ ఆజ్ఞ వ్రాశారు. దాని సారాంశ మిది:

ఆంధ్రా హైకోర్టు ప్రారంభ దినం 5-7-1954. అందుకు నేటికి నాలుగు రోజులే వ్యవధి ఉంది. సుప్రీంకోర్టు ముఖ్య న్యాయమూర్తి సిఫారసు ఇంకా అందలేదు. అయినా, ఆంధ్ర ముఖ్యమంత్రి, గవర్నరు ఇద్దరూ ప్రస్తుతం స్పెషల్ ఆఫీసరుగా పనిచేస్తున్న మద్రాసు హైకోర్టు జడ్జి కోకా సుబ్బారావుగారి పేరే సూచించారు. అందుచేత, కోకా సుబ్బారావుగారిని 1954 జూలై 5 నుంచి, ఆ రోజున ప్రారంభమవుతున్న ఆంధ్రరాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ముఖ్య న్యాయమూర్తిగాను, తక్కిన ఇద్దరిని జడ్జీలుగాను నియమించడమైనది."

దీనిని, మామూలు పద్ధతిగా - రాష్ట్రపతి జారీచేసే ఆదేశాల ఇతర లాంఛనాలతో, కావలసిన ఇతర ఉద్యోగులు సంతకాలతో జారీచేసిన ఆదేశాన్ని 4-7-54 నాటికే గుంటూరులో ఆంధ్రప్రభుత్వానికి స్వయంగా ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఉద్యోగిని పంపించారు.

గుంటూరులో, ఈ ఆదేశం అందగానే అంతదాకా ప్రభుత్వానికున్న ఆందోళన నివారణ మయింది.

ఇక్కడినుంచి ఆ తర్వాత గుంటూరులో జరిగిన విషయాలు వివరిస్తాను.

మర్నాడు ఉదయం, 3, 4 వందల న్యాయవాదుల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభామందిరంలో, ప్రకాశంగారు - ప్రారంభోపన్యాసం చేయడానికి కట్జూగారిని ఉచితమైన వాక్యాలతో ఆహ్వానించారు.

కట్జూగారి ప్రారంభోపన్యాసము, మిగిలిన సంప్రదాయానుసారమైన ఉపన్యాసాలు జరిగిన ఉత్తరక్షణంలో, ముఖ్య న్యాయమూర్తి