పుట:Naajeevitayatrat021599mbp.pdf/849

ఈ పుట ఆమోదించబడ్డది

వారు అప్పు ఇవ్వకపోతే, రాష్ట్రానికి గల ఇతర ఖర్చులైనా మానుకొని, పని వెంటనే ప్రారంభించవలసిందనీ ఇరిగేషన్ శాఖ చూస్తున్న సంజీవరెడ్డిగారితో చెప్పి, బారేజ్‌కు పునాదిరాయి వేయడానికి తేదీ, లగ్నము నిశ్చయించమని ఆదేశం ఇచ్చేశారు.

"డబ్బు విషయం తూగగలవా?" అని ఆర్థికమంత్రినైన నన్నడిగినప్పుడు, "దీనికి ఖర్చు మూడు కోట్లు. పని పూర్తి కావడానికి 2 1/2 ఏండ్లు అవుతుంది. డబ్బు విషయమై ఇబ్బంది ఉండదు," అన్నాను నేను.

ఈ విధంగా, అంత పెద్ద మేజర్ ప్రాజెక్టుకు కావలసిన అత్యవసరమైన విషయాలలో కూడా, కేంద్రప్రభుత్వంవారు - తాము వద్దన్నా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం విషయంలో తూష్ణీంభావాన్ని ప్రకటిస్తూ వచ్చారు.

అయినప్పటికీ, మన అదృష్టంకొద్దీ కేంద్రంలో దేశ్‌ముఖ్‌గారు ఆర్థికమంత్రి అయిఉండడంవల్లా, ఆయనకు ఆంధ్రరాష్ట్రంపై ఆదరబుద్ధి ఉండడంవల్లా, ఆర్థికంగా మనము ఇబ్బందులలో పడకుండా సర్దుకొని వచ్చేవారు.

నందికొండ ప్రాజెక్టు విషయమై మరొక విషయం కూడా - ఎన్ని అవస్థలు పడవలసివచ్చిందో సూచించడానికి వ్రాస్తున్నాను.

తిరిగీ కృష్ణమాచారిగారిని చూడక తప్పింది కాదు. ఈ పర్యాయం నందికొండ ప్రాజెక్టు (తరువాత ఇదే నాగార్జున సాగర్) విషయమై వెళ్ళాను. ఆయనను ఇంటిదగ్గర చూడవలసివచ్చింది. ఈ విషయం ఎత్తగానే, "అయ్యా విశ్వనాథముగారూ! మీ ఆంధ్రులకు నేనంటే నమ్మకం లేదు" అని వాతావరణమంతా కలుషితం చేయబోయారాయన.

నేను, "నమ్మకం, అపనమ్మకంతో - ఏమైనా, వ్యక్తిగతమైన వ్యవహారాలకు రాలేదు గదా!" అని చెప్పి, నందికొండ ప్రాజెక్టు శాంక్షను ఆలస్యం చేయవద్దని చెప్పాను.