పుట:Naajeevitayatrat021599mbp.pdf/845

ఈ పుట ఆమోదించబడ్డది

చేసినట్టు అన్నీ రాష్ట్రాలలోని ఖైదీలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడుదల చేయవలసిందన్న సూచన ఎవరో లోక్ సభలో తీసుకువచ్చారు.

కర్నూలు కాబినెట్‌లో ఈ విముక్తి విషయమై జరిగిన దీర్ఘ చర్చల విషయం నెహ్రూగారికి తెలిసిఉండదు. తెలుసుకొనేందుకు యత్నించి కూడా ఉండరాయన. ఆయన తత్వ మటువంటిది.

లోక్ సభలో ఆయన ఇలా అన్నారు: "ప్రకాశంగారు అకస్మాత్తుగా రాత్రికిరాత్రే ఒక ఆలోచన తెచ్చుకొని అలాంటి పనిచేశారు. అలాంటిది మనమంతా ఎలా చేస్తాము"

నీటిపారుదల ప్రాజెక్టులు.

ప్రత్యేకాంధ్రరాష్ట్రం కావాలని కోరినపుడు చాలామంది మనసులలో సువ్యక్తమయిన ఒక కారణముండేది అది - ఆంధ్రప్రాంతాలలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై ఉమ్మడి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదని.

ఉదాహరణకు, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందునుంచీ ప్రభుత్వపు కాగితాలలో ఆలోచనలో ఉన్నట్టు కనిపించిన 'వంశధార ప్రాజెక్టు' కాగితాలలోనే ఉండిపోయింది.

ఇంతేకాక, 1930 ప్రాంతాలలో చక్కగా పరిశీలించి, అన్ని విధములయిన వివరాలతో నివేదిక తయారై ఉన్నప్పటికీ కృష్ణానదిపై పులిచింతలవద్ద రిజర్వాయరు నిర్మాణం ప్రాజెక్టు ఆగిపోయింది.

అది అయిన కొంతకాలానికి, శాసన సభలో ఎవరో దాన్ని గురించి ప్రశ్నించగా, అపుడు అధికారంలో ఉన్న పి.సి రామస్వామి అయ్యరుగారు చెప్పిన జవాబు ఇది: "నేను పదవి స్వీకరించేనాటికి నా చేతికి రెందు ప్రాజెక్టుల రిపోర్టులు వచ్చాయి. ఒకటి మెట్టూరు ప్రాజెక్టు (తంజావూరు జిల్లా). రెండు పులిచింతల ప్రాజెక్టు (కృష్ణా జిల్లా). ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. రెండింటిని తీసుకోడానికి ప్రభుత్వం దగ్గర ధనము లేదు. కనుక రెండు స్కీములలో ఏదో ఒకటి తీసుకోవలసి ఉండగా, మెట్టూరు ప్రాజెక్టు తీసుకొంటిని,"