పుట:Naajeevitayatrat021599mbp.pdf/842

ఈ పుట ఆమోదించబడ్డది

822

నా జీవిత యాత్ర-4

ఇంకొకరు, "హత్యానేరానికి గాక, ఇతర నేరాలకు ఖైదులో ఉంచబడినవారి సంఖ్య తక్కువగా ఉంది" అన్నారు.

అందుకు మరొక మంత్రి "హత్య చేసినవారు 'రాజకీయ వాదులు' కాబట్టి వదిలి పెడతామంటే, రాజకీయవాదులు కాకుండా హత్యచేసినవారు చేసిన పాపమేమిటి?" అని ప్రశ్నించారు.

ఇంతేకాక, హత్యచేసిన రాజకీయవాదులను ఖైదునుంచి విడుదల చేస్తే చిల్లర మల్లర నేరాలకు శిక్షింపబడిన వారంతా విడుదలకాక శిక్ష ననుభవిస్తూనే ఉండవలసి వస్తుంది.

అందుచేత, ఇంకొక మంత్రి అపుడు అందరినీ వదలిపెట్ట వలసి వస్తుందే అని తన మాటగా అన్నారు.

అంతవరకు మాట్లాడకుండా ఉన్న ప్రకాశంగారు, కన్నులు తెరిచి, అందరివైపు చూసి-

"అందరినీ వదిలేస్తే తప్పేమిటి?" అన్నారు.

చర్చ ఫలితంగా వచ్చిన సిద్ధాంత వాక్యం తర్క సమ్మతమైనదే; కానీ, వాదించిన వారి కందరికీ అది అత్యాశ్చర్యకరంగా తోచింది. వారి వాదాలు సవరించుకో నారంభించారు.

ప్రకాశంగారు, "బాగా ఆలోచించండి, సభ వాయిదా వేద్దాము" అని, సభ వాయిదా వేసేశారు.

అప్పటికే మూడుగంటలు కూచున్నాము.

మరునాడు, తిరిగీ కాబినెట్ సమావేశ మయ్యేసరికి ఏడుగురు మంత్రులలో ఐదుగురు ప్రకాశంగారితో ఏకీభవించారు.

కాని, ప్రకాశంగారు అటువంటి తీర్మానానికి బహుమతము (మెజారిటీ) చాలదనీ, సర్వ సభ్య అంగీకారము (యునానిమిటీ) కావాలనీ అన్నారు.

మంత్రులు, ముఖ్య కార్యదర్శి ముందు వెనుకలు కొంతసేపు గదిలో, కొంతసేపు వెలుపల ఆలోచిస్తూ దాదాపు రెండుగంటలు కాలయాపనం చేయగా, ప్రకాశంగారు తిరిగి సమావేశం మర్నాటికి వాయిదా వేశారు.