పుట:Naajeevitayatrat021599mbp.pdf/840

ఈ పుట ఆమోదించబడ్డది

చదు. ప్రతిపక్షంవారు, 'అభిశంసన' 'అభిశంసన' అని పదిమార్లు అంటున్నారు. ఎవరు, దేనికి అభిశంసన తెస్తున్నారు? నేను ఇంతసేపూ మౌనంగా కూచున్నాను. ఎవరైనా నిర్మాణాత్మకంగా మాట్లాడుతారేమోనని శ్రద్దగా వింటున్నాను. చర్చలు క్రమబద్దమైన ఒక త్రోవలోకి వస్తాయేమో అని ఆశిస్తున్నాను.... ...

"ఎండబాధ, వానబాధ మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టజాలవు. కాని, ఏదైనా పార్ల మెంటరీ సంప్రదాయ మార్గంలోకి మనమంతా రాగలమేమోనని చూస్తున్నాను.

"మేము బిల్లు ప్రవేశపెట్టడమే వారుచేసే 'అభిశంసన'కు రుజువు అని వారంటే, ఇటుపైని ఇక్కడ మీరు, నేను కూచునేది ఎలాగు? పనిచేయకుండా మనము వెళ్ళిపోలేము గదా! అందుచేత, మన చర్చలు అసలు చర్చనీయాంశంలోకి వెళ్ళేలాగు చేయండీ."

మరికొంత చర్చ సాగిన తర్వాత - అయినదానికి కానిదానికి ప్రతిపక్షులు వాదిస్తున్న సమయంలో, ఆయన మరో మారు లేచి ఇలా అన్నారు:

"మాటలు చెప్పడంలో ప్రతిపక్షులు మహా ఘటికులు. ఆ కీర్తి వారిదేనని నేను ఒప్పుకుంటాను. అధ్యక్షుడు కుర్చీలో కూచున్నారనే విషయం కూడా, మన ప్రతిపక్షుల దృష్టిలో ఉండదు గదా! శాసన సభలో కానివ్వండి, శాసన సభ వెలుపల కానివ్వండి, వారి మాటే చివరిమాట కావాలంటారు. వారు చెప్పేదే, జ్ఞానానికి అవధి అంటారు.

"ఓ మారు రాజగోపాలాచారిగారు ఎప్పుడో చెప్పిన మాటలు చదివి వినిపిస్తారు. ఓ మారు తిమ్మారెడ్డిగారు చెప్పిన మాట లేవో తీసి చదివి వినిపిస్తారు. అలాగే, అంతులేకుండా, వారు చెప్పిందీ, వీరు చెప్పిందీ చదివి వినిపిస్తూంటారు. స్వంతంగా చెప్పవలసిన విషయం లేకపోబట్టే, వారి మాటలూ వీరి మాటలూ చదివి సభలో కాలక్షేపం చేస్తారు."