పుట:Naajeevitayatrat021599mbp.pdf/830

ఈ పుట ఆమోదించబడ్డది

రికార్డులన్నీ భవిష్యత్తులో సమగ్రంగా పరిశీలించగలిగే అవకాశము ఎవరికైనా కలిగితే, ప్రకాశంగారి జీవితచరిత్ర, దానితో అవినాభావ సంబంధంకల ఆంధ్రదేశచరిత్ర ఇంతకన్నా సమగ్రంగా వ్రాయడానికి వీలవుతుంది. ఆ విధంగా వ్రాయవలెకూడా.

అక్టోబరు 1 నాటికి ఒక దినం ముందుగానే, శాసన సభ్యులు, ప్రకాశంగారు, గవర్నరుగారు, ఆహ్వానితులైన అనేకమంది పెద్దలు కర్నూలు వెళ్ళారు. ఒక లక్షమందికిపైగా ప్రజలు గుమిగూడారు.

మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా ఏవో భేదాభిప్రాయం వచ్చి రంగాగారు హాజరు కామన్నారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు భవనం ఒకదాన్ని గవర్నర్ బంగళా క్రింద మార్చడం జరిగింది. నెహ్రూగారు, రాధాకృష్ణన్‌గారు బస చేయడానికి తాత్కాలికంగా రెండు వసతి గృహాలు కట్టి, ఆధునికమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కలగజేశారు. పట్నానికి కొంచెం దూరంలో నెహ్రూగారు, రాధాకృష్ణగారు వచ్చే విమానం దిగడానికి కూడా ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సమయంలో ఆంధ్రదేశమంతా ఉప్పొంగింది.

అంతకు ఒకవారం ముందునుంచి, అక్టోబరు 1 న గాక, ఒకరోజు ముందుకాని, ఒకరోజు తర్వాతగాని యీ అవతరణోత్సవం జరుపవలసిందని జ్యోతిష్కులూ, జ్యోతిషం తెలిసిన పెద్దలూ ప్రకాశంగారికి ఉత్తరాలపైన ఉత్తరాలు వ్రాయడం మొదలు పెట్టారు.

లెక్కల సౌకర్యంకోసం ఒకటవ తేదీ నిర్ణయింపబడిందనీ, అది మార్చితే లెక్కల ఇబ్బందులు వస్తాయనీ ఉద్యోగుల ఆక్షేపణ రెండో ప్రక్కనుంచి వచ్చింది.

ప్రకాశంగారేమో, "జ్యోతిష్కులు చెప్పిన అభ్యంతరాల ననుసరించి, రాజ్యాలు నడిపించే కాలము కా"దన్నారు.

అసలు జ్యోతిష్కులు చెప్పినదానిలో తనకు వ్యక్తిగతంగా నష్టం వస్తుందని ఉన్నదేగానీ, ఆంధ్రదేశ జాతకానికి నష్టం వస్తుందని