పుట:Naajeevitayatrat021599mbp.pdf/823

ఈ పుట ఆమోదించబడ్డది

"నువ్వు ఉన్న పార్టీ అంతకన్నా పెద్దది కాబట్టి నువ్వే ఈ నోటీసుపై సంతకం పెట్టాలి," అని నాతో అన్నారు ప్రకాశంగారు.

శాసన సభ్య సమావేశంలో, నేను ప్రతిపాదించిన తీర్మానానికి ప్రత్యామ్నాయంగా, ప్రతిపక్షంవారు మరొక తీర్మానం పంపించారు. సభాప్రారంభంలో నా తీర్మానం మొదట ఎజండాలోకి తీసుకొన్నారు గనుక, వారి తీర్మానాన్ని నా దానికి ఎమెండ్‌మెంట్ (సవరణ)గా తీసుకోవాలని నా వాదన. రెండు తీర్మానాలూ సమానస్థాయిలో చర్చించవచ్చని వారి వాదని.

శాసన సభా కార్యనింబంధనలలో ఒకే కాలమందు ఒకే ప్రతిపాదన చర్చించవచ్చుగానీ, రెండు స్వతంత్ర ప్రతిపాదనలను చర్చించకూడదని ఉండడంచేత అది కూడదని నా వాదన.

మొత్తంమీద - కాంగ్రెసు పార్టీ, కృషికార్ లోక్‌పార్టీ, ప్రజా సోషలిస్టుపార్టీ, కొందరు స్వతంత్ర సభ్యులు ఒకవైపునఉండి మెజారిటీలో ఉండడంవల్ల, నా ప్రతిపాదన ప్రకారం కర్నూలా, లేక వారి సవరణ ప్రకారం విజయవాడ - గుంటూరుల మధ్యభాగమా అన్నది తేలవలసి ఉంది. అందులో ఒకటి ఆమోదిస్తే, రెండవది వీగిపోయిందనేమాట నిశ్చయమే గనుక, అంతగా దెబ్బలాడుకోవలసిన విషయం కాదు.

అయినా, చాలా తీవ్రమైన వివాదం సాగింది. అసలు ముందురోజు ప్రకాశంగారి నిర్ణయానికే రాజధాని పేరు వదులుతా మన్న వారు, ఆ రోజు ఆ నిర్ణయానికి బద్దులై ఉండవలసింది. కానీ, ఆ విధంగా బద్దులమయి ఉండవలెనని, శాసనరీత్యా నిర్బంధ మేమీ లేదుకదా?

ప్రశ్న తిరిగీ లేవదీయడంవల్ల అనవసరమైన వాదోపవాదములకు చోటివ్వడం జరిగింది. ప్రకాశంగారి నిర్ణయం ఏకగ్రీవంగా ఒప్పుకొనిఉంటే, అనవసరమైన తగవులతో వ్యయం చేసిన మేధాశక్తి ఎంతో నిర్మాణాత్మకమై ఉండేది. కానీ ఇటువంటి తగాదాలన్నీ చారిత్రాత్మకంగా అగత్యాలవలె తోస్తూ ఉన్నవి.

శాసన సభ్యుల చర్చ మూలంగా, దేశంలో ముఖ్యంగా బెజ