పుట:Naajeevitayatrat021599mbp.pdf/804

ఈ పుట ఆమోదించబడ్డది

నాటి ఉదయం అక్కడ పార్టీపేరు నిశ్చయమైంది. సభలో ఎవరి సలహాపైననో 'ప్రజాపార్టీ' అనే మాటకు ముందుగా 'మజుదూర్‌' అనే మాట కలిపారు. రంగాగారి సలహాపైన దానికి ముందు 'కిసాన్‌' అన్న మాటకూడా కలిపారు. 'ప్రజాపార్టీ' అన్నది అందరి సభ్యుల ఆమోదాన్ని పొందడంచేత ఆ పార్టీకి - "కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ" అనే నామకరణం జరిగింది.

ఆ మధ్యాహ్నం మహాసభకు నాలుగైదువేలమంది హాజరయ్యారు. కృపాలానీగారు కాంగ్రెసు సంస్థలో జరుగుతున్న పక్షపాతము, బంధుప్రీతి, అధికార దుర్వినియోగము మొదలైన పరిస్థితులు వర్ణించి, ఆ దుర్గుణాలు లేని రాజకీయ సంస్థ ఒకటి ప్రారంభించడం ప్రజలకు శ్రేయస్కరమని భావించి - తాను, ప్రకాశంగారు, పి.సి.ఘోషుగారు మొదలైనవారు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పి, పార్టీకి ఆ ఉదయం పెట్టిన పేరు వగయిరా విషయాలు వివరించి, పార్టీ ఇతర వివరాలు, ప్రోగ్రాము వ్రాయడానికి నలుగురితో కూడిన ఒక ఉపసంఘం ఏర్పడేటట్టు చెప్పారు. అందులో తాను, ప్రకాశంగారు, కిద్వాయిగారు, [1] డాక్టర్ పి.సి. ఘోషుగారు సభ్యులనీ ఆయనే చెప్పారు. సాదిక్ అలీ అనే యువకుణ్ణి (ప్రస్తుతం పాత కాంగ్రెసు సంస్థలో ముఖ్యుడు) కార్యదర్శిగా నియమించారు.

కృపలానీగారు ఉప సంఘ సభ్యుల పేర్లు చెపుతున్నప్పుడు, వెనకనుంచి ఒక మిత్రుడు లేచి, అందులో రంగాగారి పేరు ఉండాలని కేక వేశాడు.

"ఇది చిన్న ఉప సంఘము. దక్షిణ ప్రాంతీయులకు ప్రాతినిధ్యానికి ప్రకాశంగారి పేరు ఉండనే ఉంది గనుక, రంగాగారి పేరు

  1. ఈయన నెహ్రూ కుటుంబానికి ఆప్తుడు. నెహ్రూ కాబినెట్ లోని తన మంత్రి పదవికి రాజీనామా యిచ్చి, క్రొత్త పార్టీలో చేరేటట్టు కృపలానీగారికి మాట యిచ్చినా, ఆ క్షణంలో మంత్రిపదవి రాజీనామా చేయలేదు. ఆ తర్వాతనూ చేయలేదు.