పుట:Naajeevitayatrat021599mbp.pdf/799

ఈ పుట ఆమోదించబడ్డది

గురు కృష్ణా జిల్లా సభ్యులు అటు దాటివేశారు. [1] ఎన్నిక తరువాత, ఏడు వోట్లతో గెలుస్తామనుకున్న రంగాగారు నాలుగు వోట్లతో ఓడిపోయారు.

ఆనాడు జరిగిన ఉదంతాలు ఆంధ్ర కాంగ్రెసు చరిత్రనేగాక, ఆంధ్ర రాజకీయ రంగ నిర్మాణ, పరిమాణాలను సంపూర్ణంగా మార్చి వేశాయి. ఆ రోజు ఎన్నిక ఫలితం చెప్పిన వెంటనే, మంత్రి గోపాలరెడ్డిగారు ఒక సూక్తి చెప్పారు.

మంత్రులుగా తాము, హెచ్. సీతారామరెడ్డి, కళా వెంకటరావు, కల్లూరి చంద్రమౌళిగారలు కావలసిన ఆదేశాలు ఇస్తుండగా, నీలం సంజీవరెడ్డిగారు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులుగా ప్రభుత్వానికి సాయపడే ముఖ్య దళనాయకుడుగా తమ వర్గ సైన్యాలను ముందుకు నడిపిస్తే, ఆ రోజు వారికి ఎదురుగా పోటీ చేసిన ప్రతిపక్షంవారు అదృశ్యులై పోతారని ఆయన చెప్పిన మాటల సారాంశము.

దాక్షిణాత్యులతో చేయి చేయి కలిపి, కుతంత్రంవల్ల ప్రకాశంగారిని మంత్రివర్గంనుంచి దించిన తర్వాత, ప్రజా సామాన్యంలో తమపై ప్రతికూలత, దొంతరలు దొంతరలుగా ఎంత పెరిగిందో వారు తెలుసుకోలేకపోయారు.

జనరల్ ఎన్నికలలో పైన చెప్పిన మంత్రులందరు ఓడిపోయారు. మరొక విశేషం కూడా జరిగింది. మద్రాసు నగరంలో పోటీ చేసిన ప్రకాశంగారు కూడా ఓడిపోయారు! ఆయన ఓడారన్న ఫలితం ఎలా వచ్చిందో, ఎలక్షన్ పిటీషన్ లేక పోవడంవల్ల నిర్ధారణగా ఏమీ చెప్పలేము. కాని, ఒక వ్యక్తి మాత్రం వోట్లు లెక్కించే సమయంలో జరిగిన ఒక విశేషం చెప్పాడు.

ఆ వ్యక్తీ, అతని భార్యా, మరొక ముగ్గురూ కలిసి వెళ్ళి, ఒకరు తర్వాత ఒకరుగా, ఒక బాలట్ బాక్సులో తమ వోట్లను వేశారు. వోట్లు లెక్కించే సమయంలో ఆ పెట్టె విప్పగా, అందులో ఒక్క వోటయినా లేదు. కౌంటిగ్ ఆఫీసరు ఆ బాక్సులో వోట్లు 'నిల్‌' అని వ్రాసుకొన్నాడు.

  1. అందులో ఒకరు - ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.