పుట:Naajeevitayatrat021599mbp.pdf/797

ఈ పుట ఆమోదించబడ్డది

1946 లో ప్రకాశంగారు, తాము ముఖ్య మంత్రి అయినప్పుడు, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ యాజమాన్యాన్ని ఆచార్య రంగా గారికి అప్పగించారు. పట్టాభిగారు అది తమ చేతుల్లోకి తీసుకోడాని కెంతో యత్నించారు. వారి పక్షాన పనిచేయడానికి పూనుకొన్న ముఖ్యమైన వారు - ఆయన అనుయాయులు, మంత్రులూ అయిన కళా వెంకటరావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిగారలు.

కాంగ్రెసు కమిటీలో సభ్యులను చేర్చి, సవ్యమైన పద్ధతిలో కాంగ్రెసు కమిటీని వశం చేసుకోవడానికి యత్నిస్తే, అందులో తప్పు లేదు. కాని, వారి వర్గీయులు, సవ్యమైన మార్గాన సభ్యులు కావడానికి రంగాగారి (అనగా, ప్రకాశంగారి) వర్గంవారు అవకాశం ఇవ్వలేదన్న నెపంపైన, ఒక లక్ష పేర్లు జాబితాలుగా వ్రాసి, అవి కాబోయే సభ్యుల పేర్లని, నిర్దారణ సూచకంగా వేలి ముద్రలు అనేకములైనవి తగిలించి, లక్ష మందికి కావలసిన చందా మొత్తం ఇరవై అయిదువేల రూపాయలు కాగ్రెసు అధ్యక్షుని పేర డిల్లీకి పంపారు. ఇవన్నీ దొంగ జాబితాలని ప్రకాశంగారి వర్గంవారు వేంటనే కనిపెట్ట గలిగారు. ఈ పాతిక వేలూ, పావలా పావలా చొప్పున చందాదారు లిచ్చిన డబ్బు కాదు. ఒక రిద్దరు వర్తకులు, ఒక రిద్దరు జమీందారులు (అపుడు జమీందారీల రద్దు బిల్లు సెలక్టు కమిటీ [1] ఎదుట ఉన్న కాలము) ఇచ్చిన మొత్తాలు కలపగా పాతిక వేలయింది. అందులో ఆరువేలిచ్చిన జమీందారు పేరు నాకు జ్ఞప్తిలో ఉంది. ఈ విధంగా చేసిన ఆరోపణ లన్నీ కొంతకాలానికి చర్చకు వచ్చి, ఆ లక్ష సభ్యుల పేర్లు జాబితాలోంచి కొట్టివేయబడ్డాయి.

ఈ యత్నం విఫలం కాగానే, 1951 లో వారు తిరిగి మరొక

  1. ఒక శాసనం ప్రవేశపెట్టినపుడు, అందులోని బాగోగులు బాగా పరిశీలించి చక్కదిద్దడానికి, అన్నీ పార్టీల ప్రాతినిధ్యంతో కూడిన శాసన సభ్యుల ఉప సంఘాన్ని 'సెలక్టు కమిటీ' అంటారు. వీరి నివేదికపైనే శాసన సభలో తర్వాత ఆ శాసనం గురించి చర్చ జరుగుతుంది.