పుట:Naajeevitayatrat021599mbp.pdf/785

ఈ పుట ఆమోదించబడ్డది

ఒక ఆసామీ భవిష్యత్తులో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయితే తనకు ఏదో ఫారెస్టు కాంట్రాక్టులకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చిన లంచమని, ఆ మొత్తం ఆ వ్యక్తి ఏ బ్యాంకువారి ఏ నెంబరు చెక్కుమీద వ్రాసియిచ్చాడో వివరిస్తూ, తమ వర్గంమీది నేరారోపణలను పరిశీలించేటపుడు, ప్రకాశంగారు పుచ్చుకొన్న యీ లంచం విషయంకూడా చర్చించాలనే ప్రతి విజ్ఞప్తి ఆ శంకరరావుదేవుగారి చేతిలో పెట్టారు.

శంకరరావుదేవుగారు రాగానే, ప్రకాశంగారు తమపై నున్న ఆరోపణలన్నిటికీ 'కాపీలుకాక అసలు కాగితాలనే చూపించ' మన్నారు. ఆయన కాపీలు ఇచ్చినప్పుడు అసలుతో సంబంధమేమని అడిగారు.

"క్రిమినల్ కేసులో ముద్దాయికి అసలుకాగితం చూసే హక్కుంది. చూపించం"డని ప్రకాశంగారంటే, ఆయన, "కాపీలో ఉన్నదే అసలులో ఉంటుంది గదా! ఎందుకు అసలు కావాలని నొక్కి అడగడ"మని ప్రశ్నించారు.

అందుకు ప్రకాశంగారు ఇలా చెప్పారు:

"ఈ మంత్రులపై నేను ఆరోపణలు తెచ్చి, మూడేండ్లు కావచ్చింది. ఈ మూడేండ్లలో, ఇప్పుడు నాపై చేసిన ఈ ఆరోపణల ప్రసక్తి రాలేదు. ఇటువంటిది - నిజంగా వారు నా మీద చేయదలచి ఉంటే, 1946 లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి ఉండవలసింది.

"ఇవన్నీ రాజకీయాలు. అందుచేత, ఇంత ఆలస్యంగా వచ్చిన ఆరోపణ, అసలు ఎక్కడనుంచి పుట్టిందో తెలుసుకోవాలి. ఈ సంతకం పెట్టిన ఆసామీ కృష్ణాజిల్లావాడు. ఈ కాగితం కృష్ణాజిల్లాలో పుట్టలేదు. నాకు లంచమిచ్చాడని ఆరోపింపబడిన మనిషి చెన్నపట్నంవాడు. ఈ కాగితం చెన్నపట్నంలో పుట్టలేదు. ఇది ఢిల్లిలో పుట్టింది. అసలు కాగితం చూస్తే, అది ఎవరి ఇంటిలో పుట్టిందోకూడా చెప్పగలను. అందుకోసమే అడుగుతున్నాను."