పుట:Naajeevitayatrat021599mbp.pdf/753

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫోన్‌చేసి వానియంబాడీ ముస్లింలకు తక్షణ రక్షణకు ఏర్పాట్లు చేయించవలెనని ప్రార్థించారు.

ప్రకాశంగారు, "ఇస్మాయిల్ సాహేబుగారు! మీరు ప్రతిపక్ష నాయకులు. నేను ముఖ్య మంత్రిని. ఈ పని మన ఇద్దరిదీ. మనము లేనిదే ఫోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఏమి చేయగలడు? వెంటనే మనం ఇక్కడనుంచే బయలుదేరుదాము" అని వారితో చెప్పి, వెంటనే కారులోకి దూకారు. తాము అక్కడికి బయలుదేరి వెళుతున్నట్టుగా ఇన్‌స్పెక్టర్ జనరలుకు ఫోను చేయించారు.

వారిద్దరు వానియంబాడి చేరకునేసరికి, పట్టపగలు సూర్య కాంతిలా పొగలు కమ్ముకుంటున్న ఎఱ్ఱని అగ్ని జ్వాలలు ఎత్తుగా లేస్తూనే ఉన్నాయి.

ఆ సాయంకాలం లోపున అక్కడ శాంత పరిస్థితులు కల్పించి, రాత్రికి మళ్ళీ ప్రకాశంగారు చెన్నపట్నం తిరిగి వచ్చారు.

ఇటువంటి సాహసం ఆయన కుండడంచేతే, తర్వాత ఆయనపై విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చినపుడూ, ఆ తర్వాత ప్రకాశంగారు తమ్ము పదవిలోంచి దించివేసిన మంత్రులపై అధికార దుర్వినియోగం చేసిన నేరాలపై చర్చ జరిగినపుడూ ముస్లిం సభ్యుల సానుభూతి సంపూర్ణంగా ప్రకాశంగారి పైనే ఉండేది.

డాక్టర్ బి. విశ్వనాథ్

డాక్టర్ బి. విశ్వనాథ్, డైరక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా ఉండేవారు. ఆయన విజయనగర వాస్తవ్యుడు. ఇక్కడ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యే అవకాశాలు లేనందున, విదేశాలకు వెళ్ళి, వ్యవసాయ సంబంధమైన పెద్ద డిగ్రీలు పొంది, డిల్లీలోని పూసా వ్యావసాయిక మహా సంస్థకు పెద్ద అయ్యాడు. ఆ తర్వాత, యుద్ధ సమయంలో భోర్ కమిటీ అనే సంఘంలో దేశపు ఆహార, ఆరోగ్య విషయమై బాగా పరిశోధించినవాడు.

అంత పెద్ద అర్హతలుగల వానిని మన రాష్ట్రంలో వ్యవసాయ