పుట:Naajeevitayatrat021599mbp.pdf/752

ఈ పుట ఆమోదించబడ్డది

గతంగా జోక్యం కల్పించుకోరు. ప్రకాశంగారి సంతకం కోసం ఆ ఫైలు అందిస్తున్నప్పుడు రెండు మూడు కాగితాలు అటూ ఇటూ తిప్పడంలో విద్యాశాఖ మంత్రి వ్రాసిన మినిటు (ఫైలుమీద మంత్రులు వ్రాసే అభిప్రాయం లేక నిర్ణయము) కంటబడింది. అందులో ఒక పంక్తి కంట్లో కొట్టినట్టుగా టైపయి ఉంది. అది - "నెంబరు - పేరుగల అభ్యర్థి బ్రాహ్మణుడు. అతని పేరు తీసివేయండి. ఈ నెంబరుగల ఆసామి పేరు ఇక్కడ కలపండి," అని.

జస్టిస్‌పార్టీ మంత్రి అయినా బహుశ: అలా వ్రాసి ఉండడు. ఎందు కిలా వ్రాశాడని పైలులో ఆ పేర్లుగల విద్యార్థుల అర్హతలు చూశాము.

తీసివేయవలసిందనే సూచనగల అభ్యర్థి ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆనర్సు ఫస్ట్ క్లాస్‌లో పాసయిన విద్యార్థి. రెండవ అభ్యర్థి దక్షిణ జిల్లాలలోంచి మూడవ క్లాసులో పాసయివచ్చిన విద్యార్థి. ప్రకాశంగారు విద్యామంత్రిగారి సూచన కూడదని, తిరిగి సచివాలయం వారు చెప్పిన సూచననే సమర్థించారు.

కార్య నిబంధనల ప్రకారం ఈ ఫైలు విద్యామంత్రికి వెళ్ళింది. అప్పటికి ఆయన వివేకం తెచ్చుకొని, ప్రకాశంగారు చెప్పిన దానికి ఒప్పుకొని సంతకం పెట్టేశాడు. ఆ మంత్రే మెడికల్, ఇంజనీరింగు కాలేజీలలో మార్కుల ప్రకారంగా నూటికి యాభై స్థలాలు ఉంచాలని చెబితే కాదని, కులము వారీగా ఉండాలని వాదించిన వ్యక్తి.

వానియంబాడి అల్లరులు

ఒక రోజు తెల్లవారు జామున మూడు గంటలప్పుడు, ప్రతిపక్ష నాయకుడైన ఇస్మాయిల్ సాహేబుగారు, మరి కొంతమంది ముస్లిం సోదరులూ కలిసివచ్చి, ప్రకాశంగారిని నిద్రనుంచి లేపారు. వారు - వానియంబాడిలో హిందువులకు, ముస్లింలకు తగాదా వచ్చి, ముస్లింల తోళ్ళ కర్మాగారాలు, గొడొనులు తగుల పెట్టారని చెప్పి, అగ్నిజ్వాలలు రాత్రి మొదలు అప్పటి దాకా ఆకాశం ఎత్తున లేస్తున్నాయనీ, కనుక