పుట:Naajeevitayatrat021599mbp.pdf/751

ఈ పుట ఆమోదించబడ్డది

భరించడానికి సరిపోతుందా?" - ఇత్యాది అనేక ప్రశ్నలు అనవసరంగా లేస్తాయనీ, ఇంతకూ గవర్నరు నివసించే బంగళాలు, భవనాలు పాతపద్ధతి ప్రకారం గవర్నరు పేరిట ఉన్నా, అవికూడా చెన్నరాష్ట్రపౌరులు పన్నుల మూలంగా ఇచ్చిన డబ్బుతో కొనబడినవే అనీ, మౌంటురోడ్డు ఆవరణ కొనినప్పటి లెక్కలు మొదలైనవి ఆయనకు ఒక రెండుగంటలు ప్రకాశంగారు ముఖాముఖి చర్చలో తెలియజేశారు.

ఆయన మరల, నిర్ణయించుకోవడానికి మరికొంత వ్యవధి అడిగారు.

ఆ తర్వాత, మరొకమారు ఈ విషయం ఒక పావు గంటసేపు మాటాడిన తర్వాత, మౌంటురోడ్డులోని గవర్నరు బంగళా, యావదాస్తీ ప్రభుత్వంపేర నమోదు చేయడానికి ఆర్డరు జారీ అయింది.

ఇది జరిగిన కొంత కాలానికి ప్రకాశంగారి ప్రభుత్వం పడిపోయింది. తర్వాతి ప్రభుత్వంవారు, ఈ ఆస్తి నంతటినీ ప్రభుత్వపరంగా వ్రాయించిన ప్రకాశంగారి విషయం మరచిపోయి, ప్రయత్నించి విఫలులైన రాజాజీ పేరిట ఆ విందుల హాలుకు 'రాజాజీ హాలు' అని నామకరణం చేశారు.

ఆ పేరుతోనే అది యిప్పటికీ ఉన్నది.

విదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్ షిప్పులు

ప్రకాశంగారి ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది రోజులకు ఒక ఫైలు వచ్చింది. పట్టభద్రతానంతర ఉన్నత విద్యా శిక్షణకై ప్రభుత్వం వారిచ్చే వేతనాలపైన, నూట నలభై మందిని విదేశాలకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం వారి ప్రతిపాదన అందులో ఉన్నది. రెండు వందలపైగా విద్యార్థుల పేర్లు, వారి అర్హతలు వ్రాసి, అందులో ప్రభుత్వానికి తోచిన నూట నలభై మంది పేర్లు [1] ఖాయం చేయాలి.

మామూలు ప్రకారం సచివాలయంవారు, వారికి తోచిన సూచనలు చేశారు. అటువంటి వాటిలో సాధారణంగా మంత్రులు వ్యక్తి

  1. ఈ సంఖ్య నాకు సరిగా జ్ఞాపకం ఉండక పోవచ్చును.