పుట:Naajeevitayatrat021599mbp.pdf/733

ఈ పుట ఆమోదించబడ్డది

విలువ ఏ ప్రభుత్వంవారు కట్టగలరు? వీరుగాక, తల్లాప్రగడ ప్రకాశరాయుడు, వేగిరాజు కృష్ణంరాజు, లింగంరాజు గోపాలరావు, మల్లిమడుగుల కోదండరామస్వామిగారలు-గాంధీ జీవనం, ప్రకృతివైద్యం, బేసిక్ ఎడ్యుకేషన్ (మౌలిక విద్యావిధానం), ఖాదీ ఉత్పత్తి, ఆర్థిక సంపద మొదలైన విషయాలను గూర్చి ఈ కేంద్రంలో బోధించేవారు. గ్రామాభ్యుదయానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, మంచి నీటి సౌకర్యాలు మొదలైన పెద్ద పెద్ద పనులను కూడా గ్రామీణుల సహాయంతో తక్కువ వ్యయంతో చేయించేవారు. ముఖ్యంగా, హరిజన వాడల అభ్యుదయానికై గట్టి యత్నం చేశారు. 1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయి, మొదటి బడ్జటులో హరిజనాభ్యుదయయానికై ఒక కోటి రూపాయలు లంప్‌సమ్ (అనగా, చేయబోయే స్కీము లేవో తెలియనక్కర లేకుండానే ఎంతయితే అంత ఇచ్చేందుకుగాను కేటాయించబడిన మొత్తం అని అర్థము) కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కారణంచేత గోపన్నపాలెం ప్రాజెక్టులో, హరిజనాభ్యుదయానికి ప్రాముఖ్యం ఇవ్వబడింది.

అయితే, ప్రకాశంగారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత - ఈ లక్ష్యాలను ఆయన అనుకున్న విధంలో సాధించకపోయినా, ఈ కేంద్రం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (సమాజ వికాసం) కేంద్రాలనే క్రొత్త పథకంలో కలపబడింది. ప్రకాశంగారి ఉద్దేశాలకు, ఈ వికాసకేంద్రాల ఉద్దేశాలకు చాలా భేదముంది. ఆయన పథకంలో స్వయం పోషక గ్రామ స్వరాజ్యముంది. సమాజ వికాస కేంద్రాలకుగూడా గ్రామాల వికాసమే లక్ష్యమయినా, స్వయం పోషకత్వమనే లక్ష్యం లేదు. స్వయంపోషక గ్రామ స్వరాజ్య పథకంలో ఇతరగ్రామాల రాజకీయాల ప్రభావంగానీ, రాష్ట్రంలో జరుగుతుండే రాజకీయాల చదరంగపుటెత్తులతో సంబంధంకానీ ఉండదు. వికాసకేంద్రాలు అటువంటి చదరంగం ఆడడానికి ముఖ్య కేంద్రాలుగా మారడంవల్ల, తరువాత పంచాయితీ రాజ్యభావంలో లీనమై, చివరకు పంచాయతీ రాజ్యం పార్టీ కక్షలకు కదనరంగంగా పరిణమించింది. ఇటువంటి దుష్పరిణామాలు రాకుండా