పుట:Naajeevitayatrat021599mbp.pdf/731

ఈ పుట ఆమోదించబడ్డది

భవించే వీలు కలిగింది. ఈ స్కీమువల్ల గ్రామస్థుల జీవనపద్ధతిలో ఒక విప్లవాత్మకమైన మార్పు కలిగింది.

గోపన్నపాలెము - జోగన్నపాలెము

గ్రామ స్వరాజ్యం; గ్రామాలను స్వయంపోషకంగా అభివృద్ధిచేయడం అనేవి ప్రకాశంగారి మనసులోని గాఢమైన లక్ష్యాలని లోగడ వ్రాశాను. 1937 లో రెవిన్యూ మంత్రిగా ఉన్నరోజులలో, కాగితాల మీద కొన్ని స్కీములు వ్రాయడంతోనే సరిపోయింది. మంత్రివర్గం రాజీనామా చేసిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని జోగన్నపాలెం అన్న గ్రామంలో "ఆదర్శగ్రామం" అనే లక్ష్యంతో నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు.

అక్కడే, గ్రామీణ విద్యాకేంద్రం (గ్రామ విశ్వ విద్యాలయం) అనే సంస్థను లేవదీసి, దానికి బాబూ రాజేంద్రప్రసాదుగారిని కులపతిగా ఏర్పాటు చేశారు. ప్రకాశంగారే దానికి ఉపకులపతి. గాంధీగారు చెప్పిన నిర్మాణ కార్యక్రమం, నూలు వడకడం, చేనేత, గ్రామ కుటీర పరిశ్రమలు మొదలైనవికూడా ఏర్పాటు చేయడమైనది. అయితే, రాను రాను అది క్షీణించింది. అయినా, ఇంకా సంపూర్ణంగా పోకుండా ఖాదీ పరిశ్రమ నడుస్తున్నట్టు తెలుస్తున్నది. 1946 లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామసౌభాగ్యం పెంచడంకోసమని అమలుపరచిన స్కీములలో ఒకటి గోపన్నపాలెం అనే గ్రామంలో ఉండేది దానిపేరు గ్రామసేవకుల శిక్షణ కేంద్రము. ఈ శిక్షణ కేంద్రంలో - (1) ఖద్దరు విషయమై తీవ్రమైన కృషి; (2) హరిజనోద్దరణ; (3) గ్రామీణులకు రవాణా; (4) మంచినీటి సరఫరా సౌకర్యముల విషయము; ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటినిగురించి శిక్షణ ఇచ్చే ఏర్పాటు జరిగింది. [1]

ఇది ఉత్తర జిల్లాలలో ఏర్పాటయిన కేంద్రము. ఇదేవిధంగా దక్షిణ జిల్లాలలో టీ - కల్లుప్పటిలో ఏర్పాటు జరిగింది. గోపన్నపాలెంలో పైన చెప్పిన శిక్షణ కార్యక్రమమే కాక గ్రామ పరిశ్రమలకు మాడల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన శిక్షణ ఇచ్చే కార్యప్రక్రియ కూడా

  1. జి.ఓ. నెంబర్ 757 / సెప్టెంబర్ 1946.