ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన క్లాసు చాలా కులాసాగా వుండడంచేత, బాగా శ్రద్ధగా వింటున్నాను. ఇల్లా వుండగా మల్లంపల్లి వీరభద్రుడు అనే ఒక సహాధ్యాయి నా పౌడరు చూసి హేళనగా మాట్లాడడం ఆరంభించాడు. ఒకటి రెండు సార్లు సహించుకుని, అతను అదేపనిగా విసిగించడం చేత బాగా చిరాకుపడి, శాస్త్రుల్లుగారు బోర్డుకేసి తిరిగి వుండగా, వెనక్కి తిరిగి ఫెళ్ళున ఒక్క చెంపకాయ లాగాను! దాంతో క్లాసంతా గొల్లుమన్నారు! శాస్త్రుల్లుగారు చట్టున నాకేసి తిరిగి, విషయం అంతా గ్రహించి, "ఏమిరా, వీరభద్రంతో షేక్ హాండ్ చేశావా ఏమిటి?" అన్నారు! క్లాసు మరింత గొల్లుమన్నారు!

ఈ విషయం అంతా సహజంగా మెట్కాఫ్ దగ్గిరికి ఫిర్యాదుకి వెళ్ళింది. మెట్కాఫ్ నన్ను పరీక్షకి పంపించకుండా నిలిపివేస్తానని బెదిరించారు. దానిపైన నేను వీరభద్రుడికి క్షమాపణ చెప్పడంతో ఆ వ్యవహారమంతా సద్దణగిపోయింది. మెట్కాఫ్ పరిపాలనలో వుండే విశేషం కూడా అదే! ఏదో విధంగా తను సద్దిచెయ్యడమే కానీ విద్యార్థి భవిష్యత్తుకి ఎప్పుడూ భంగం కలిగించేవాడుగాడు. ఆ తరవాత చాలాకాలానికి నేను ఇంగ్లాండులో కలుసుకున్నప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపడి "నువ్వు ఇంత వృద్ధిలోకి వస్తావని అనుకోలేదుసుమా!" అన్నాడు.

ఈ కాలంలో రాజమహేంద్రవరంలో వీరేశలింగంగారి సంస్కరణోద్యమం చాలా తీవ్రంగా సాగుతూ వుండేది. నేను రాజమహేంద్రవరం వచ్చేసరికి ఆ ఊళ్ళలో ఈ ఆందోళన చాలా హెచ్చుగా వుండింది. నేను మెట్రిక్యులేషన్ చదువుతూ వుండగా, వీరేశలింగం గారి ఆధిపత్యం కింద విధవా వివాహాలు జరుగుతూ ఉండడం జ్ఞాపకం వుంది. మానూరి పురుషోత్తం వివాహ సందర్భంలో పంతులుగారి చాకచక్యమూ, పద్ధతులూ నేను బాగా గమనించాను. తమ కార్యసాధనకి అవసరమని తోస్తే ఆయన రౌడీల సహాయమూ, లౌక్యుల సహాయమూ కూడా పొందేవాడు.

అప్పట్లో విద్యావంతులై సంఘానికి నాయకులుగా వుండినవాళ్లు అంతా సంస్కర్తలే. న్యాపతి సుబ్బారావు పంతులుగారు, పెద్దాడ