పుట:Naajeevitayatrat021599mbp.pdf/722

ఈ పుట ఆమోదించబడ్డది

నిత్యమూ సాగించే పాదయాత్రకై వెళ్ళిన ప్రకాశంగారు, కొంతదూరంవెళ్ళి, ఎవరికీ తెలియకుండా గోపాలరెడ్డిగారి బసలోకి వెళ్ళారని ఒక వదంతి బయలుదేరింది.

నిన్నటిదాకా, పీకమీద కాలువేసి తాండవం చేస్తున్న అతని యింటికి ప్రకాశంగారు వెళ్ళడం, తమ పీకలమీద ఆయన కాలువేసి తొక్కేసినట్లే అని - ప్రకాశంగారిమీది అభిమానంవల్ల పుట్టిన ఆగ్రహంతో జనం ప్రకాశంగారి యింటి దగ్గరికి చేరి, "ఏరీ పంతులుగారు?" అని అడగసాగారు. కాని, ఆయన అప్పటికి తిరిగి రాలేదు. అ వచ్చే జనం సంఖ్య క్షణక్షణానికి హెచ్చుతూ వచ్చింది.

అంతట్లో, రమారమి తొమ్మిది గంటలకు ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. 'గోపాల రెడ్డిని మంత్రిగా చేస్తే మేము ఒప్పుకొనేది లే'దని అక్కడ చేరినవారు ఏక కంఠంగా కేకలు వేయగా, ప్రకాశం గారు వారిని సమాధాన పరచి, మెల్లిగా పంపించేశారు.

ఆ మధ్యాహ్నం, ఆయన నన్ను డాక్టర్ రాజన్‌గారి దగ్గరికి పంపారు. నేను వెళ్ళేసరికి ఆయనతోబాటు - మధురలో సుప్రసిద్ద న్యాయవాది, త్యాగశీలుడు, శాసన సభా సభ్యుడు అయిన వైద్యనాథ అయ్యర్‌కూడా ఉన్నారు.

వారితో, "తప్పకుండా మీరు మంత్రివర్గంలో చేరాలని మిమ్మల్ని ఆహ్వానించడంకోసం ప్రకాశంగారు మిమ్మల్ని కలుసుకోదలుచుకున్నారు. మీ వర్గం తాలూకువారిని రెండుపేర్లు ఇచ్చినట్టయితే నేను ప్రకాశంగారికి అందజేస్తాను. రేపటికి మంత్రివర్గం పూర్తికావాలని ఆయన అభిలాష," అని చెప్పాను.

డాక్టర్ రాజన్‌గారు క్లుప్తంగాను, వైద్యనాథ అయ్యర్‌గారు బహుళంగాను - రాజాజీకి జరిగిన అన్యాయం గురించీ, ఆయనమీద కక్ష సాధించడానికి నాడారు బయలుదేరినా; వృద్ధులు, కార్యజ్ఞులు అయిన ప్రకాశంగారు నాడారుతో కలియడం రాజనీతి ప్రమాణాలను తగ్గించిందని ఏదేదో ఉపన్యాస ధోరణిలో పడిపోయి, చివరకు తాము