పుట:Naajeevitayatrat021599mbp.pdf/721

ఈ పుట ఆమోదించబడ్డది

దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు - ప్రకాశంగారు ఎన్నికయ్యారనీ, అధిష్ఠానవర్గంవారు, మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో తమ సలహాను ప్రకాశంగారికి పంపించవలసిందనీ తంతివార్త యిచ్చారు. అందుకు ఆజాదుగారు ఇచ్చిన జవాబులో, "మా సలహాను ధిక్కరించి ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకొన్న మీ పార్టీకి, మంత్రివర్గం ఏర్పాటు విషయమై మేము ఏ సలహాను ఇవ్వదలచుకో లేదు," అని ఉంది.

అధిష్ఠానవర్గంవారు ఎంత కోపావేశంలో మునిగిపోయారో, ఆ జవాబులోగల భాష చెప్పకే చెపుతున్నది.

నాటిమొదలు నేటివరకు - కాంగ్రెసువారి ప్రజారాజ్యం ఢిల్లీ నుండి నడిపే రాజ్యమే తప్ప మరొకటి కాదు.

13

ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు

ఎన్నిక అయిన వెంటనే, యథాశాస్త్రంగా గవర్నరును చూడడానికి ప్రకాశంగారు వెళ్ళారు. మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కొంత వ్యవధి పుచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఆ వీథి అంతా కార్యదర్శులు, పెద్ద ఉద్యోగులు, అభిమానులతో నిండిపోయింది.

ఆ రోజులలో ప్రకాశంగారికి ఎమ్. కె. వి. రెడ్డి, బొప్పన హనుమంతరావు అనే ఇద్దరు బారిష్టరులు చాలా సహాయకారులుగా ఉండేవారు. ప్రకాశంగారు బసచేసిఉన్న ఇల్లు పై చెప్పిన హనుమంతరావుగారిది. ఆ వీథి వీథంతా ముఖ్యంగా ఆంధ్రులతో నిండిపోయింది. అంతవరకు కంచెమీద అటా యిటా అని సందేహంతో నిల్చున్న కొందరు శాసన సభ్యులు కూడా (వోటింగులో వారేమి చేశారో తెలియదు) వచ్చి, ప్రకాశంగారిని అభినందించారు.

మరునాడు ఉదయం - మామూలుగా ఆరోగ్య పోషణార్థం