పుట:Naajeevitayatrat021599mbp.pdf/718

ఈ పుట ఆమోదించబడ్డది

"నేను రోజుకు వేయి రూపాయలు ఫీజు పుచ్చుకొని న్యాయస్థానాలలో న్యాయవాద వృత్తిసాగించి సంపాదించినపుడు కూడా, ఆ డబ్బు ప్రజాధనమనే అనుకొనేవాడిని. ఏ పద్ధతి అయినా, ప్రజాసేవకుడు వాడిన ధనము ప్రజల ధనమే."

ఈ ఉత్తరం అందేసరికి గాంధీగారికి కోపం మరింత హెచ్చినది. ఆయన శాసన సభలో ఎంతమాత్రమూ నిలుచోవద్దని ప్రకాశంగారికి ఆజ్ఞాపూర్వకంగా ఉత్తరం వ్రాసి, తమ్ము చూడవలసిందని కామరాజుగారికి కబురు పంపించారు.

ఆ సాయంకాలం నాడారుగారు ప్రకాశంగారి దగ్గరికి వచ్చి, గాంధీగారు ప్రత్యేకంగా రమ్మని కబురు పంపడం గురించి చెప్పి, "వెళ్ళవచ్చునా?' అని సలహా అడిగారు. ప్రకాశంగారు, "పెద్దవారు పిలిచినపుడు వెళ్ళవలసినదే గదా! వెళ్ళిరండి," అన్నారు. తర్వాత ఇద్దరి మధ్య వేరే సంభాషణ ఏదీ జరగలేదు.

అప్పుడు వెళ్ళిన నాడారుగారు మరి రాలేదు. ఆ మర్నాడూ రాలేదు. అంతేకాదు, చెన్నపట్నం చేరి, నాయకుని ఎన్నికలో ప్రకాశంగారికి ప్రత్యర్థిగా ఇంకొకరి పేరు ప్రతిపాదించి, ఆ ప్రతిపాదన వీగిపోయిన తరువాతవరకు ఆయన ప్రకాశంగారిని మళ్ళీ చూడలేదు.

గాంధీగారు, నాడారుల మధ్య జరిగిన విషయం తర్వాత తెలిసింది. నాడారుగారితో గాంధీగారు అన్న మాటల సారాంశ మిది:

"ప్రకాశంగారిని నాయకత్వానికి పోటీ చేయవద్దని నే నాదేశించాను, ఆయన నిల్చునేందుకు సాహసింపజాలడు.[1] ఒకవేళ ఆయన అలా సాహసించితే, మీరు మరెవరి పేరో ప్రతిపాదించి ఆయనను ఓడించవలెను."

ఇది ఇలా ఉంటూండగా, పట్టాభిగారి తరపున యత్నం జరగడం మానలేదు. గాంధీగారికి - కళా వెంకటరావు, గోపాలరెడ్డిగారు కలసి ఒక తంతి వార్త ఇచ్చారు. అందులో "మా చెన్నరాష్ట్రంలో

  1. "He dare not stand" అని గాంధీగారి వాక్యము.