పుట:Naajeevitayatrat021599mbp.pdf/713

ఈ పుట ఆమోదించబడ్డది

అవి సర్దుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా మనము ఏకమై ఉండాలి. ఈ తంతి పంపినది. ఆజాదుగారయినా, నిజానికి ఈ పిలుపు మహాత్మాజీ దగ్గరనుంచి వచ్చిందని భావించాలి. అందుచేత, మన మీ కార్యాన్ని సర్దుకొనేందుకు కొంత గడువు తీసుకొని, తిరిగి 15 వ తేదీన సమావేశ మౌదాము."

ఢిల్లీలో గాంధీగారివద్ద...

కథా రంగం చెన్నపట్నం హిందీ ప్రచార సభా మందిరంనుంచి ఢిల్లీలో భంగీకాలనీకి మారింది. ఇక్కడి కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురూ గాంధీగారిని సందర్శించడానికి భంగీకాలనీకి వెళ్ళారు. వెళ్ళిన క్షణం నుంచి వారు గాంధీగారి నోటివెంట విన్నది ఒక్కటే మాట. అది -

"మీరు రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసింది. ఎన్నుకోండి!"

లోగడ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ సభలో, ఆయన రాజాజీ ప్రసక్తి తీసుకురాగా, సభలో ఎవరో లేచి - "మీరు రాజాజీని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇప్పుడిక్కడికి వచ్చి ఉన్నారా?" అని గట్టిగా అడిగారు. దానికి జవాబుగా గాంధీగారు, "ఆ పనికైతే నే నింత దూరం రావలెనా? తలచుకొంటే ఢిల్లీలోనే ఒక క్షణంలో ఆ పని చేయగలను," అని అన్నారు. ప్రశ్న, జవాబూ అప్పటి పత్రికలలో పెద్ద అక్షరాలలో పడినాయి. భంగీకాలనీలో ఆయన రాజాజీని ఎన్నుకోమని చెప్పిన మాటను, హిందీ ప్రచార సభలో చెప్పిన మాటను మనము సమన్వయించుకోవచ్చు.

కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురితోనూ రాజాజీని ఎన్నుకోమని గాంధీజీ చెప్పగా, కామరాజ్‌గారు 'అది కుదర'దని వెంటనే తమిళంలో చెప్పారు. మాధవ మేనోన్‌గారు దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అయినా, మహాత్మాజీ అంతటితో ఊరుకోలేదు. చెన్నపట్నం వెళ్ళి, శాసన సభ్యుల సమావేశంలో రాజాజీ పేరు ఒక్కటే ప్రతిపాదించి, అందుకు అనుకూల, ప్రతికూల సభ్యుల సంఖ్యలను తమకు తెలియ జేయవలసిందనీ; మిగిలిన కార్యక్రమం తరువాత నిశ్చయింపవచ్చనీ ఆయన ఆదేశించారు.