ఈ పుట ఆమోదించబడ్డది

పెద్ద మనిషి కూడా లేకపోయాడు! అందుచేతనే నా మనస్సులో బయలుదేరిన తీవ్రమైన ప్రతీకార బుద్ధిచేత నే నిందుకు పాల్పడ్డాను. ఆ రోజుల్లో నా మన:ప్రకృతి అల్లా వుండేది. బహుశ: అల్లాంటిదే ఇప్పుడు జరిగితే ఆ ప్రతీకారం మరో రూపం ధరించేదేమో!

ఈ కేసు సందర్బంలో నేను చూపించిన ధైర్యం తలుచుకుంటే ఇప్పటికి నాకే ఆశ్చర్యంగా వుంది. కొట్టడం అంటే నలుగురూ కొట్టారు. కాని, కేసు వచ్చేటప్పడికి అంతా జావ అయిపోయారు. ఏ పాపమూ ఎరక్కపోయినా, నాకు అన్నివిధాలా సంరక్షకులుగా వుండిన హనుమంతరావు నాయుడుగారు కూడా కేసులో ఇరుక్కున్నారు. ఎందుకైనా డబ్బు కావలిస్తే, ఎల్లాగో అల్లాగ సంపాదించి ఇవ్వగలరు గాని, ఆయన ఇల్లాంటి పిల్లసమ్మేరీలకి కూడా ఎక్కడ అవస్థ పడగలరు? ఈ విషయంలో ఆయన కూడా నిరుత్సాహపడ్డారు. అయితే నేను చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదనే ఒక ఘనవిశ్వాసంవల్ల ధైర్యం చిక్కబట్టుకుని బయటపడ్డాను.

సహాధ్యాయు లంతా "నేను ఈ రౌడీగందరగోళాల్లో పడిపోయాననీ, ఇంక బయటపడడం అసాధ్యం అనీ" అనుకుంటూ వుండేవాళ్లు. నాకు మాత్రం ఎందుచేతనో నిస్పృహ కలగలేదు. ఇన్ని గత్తర్లలో పడినప్పటికీ నాకు చదువుమీద మాత్రం లక్ష్యం తప్పలేదు. యథాప్రకారంగా పాఠాలు చదువుతూనే వుండేవాణ్ణి. ఆ విషయంలో మాత్రం నా మనస్సు ఏ విధంగానూ చెదరలేదు.

కాలేజీలో నేను మెట్కాప్ అభిమాన శిష్యుల్లో ఒకణ్ణి. నేను నాటకాల గంద్రగోళంలో వున్నా, నామీద కేసులు నడిచినా, ఆయన నన్ను ఒక కంటితో కాపాడుతూ వుండేవారు. ఒకసారి చింతలూరి కృష్ణారావూ - (ఆయన ఇటీవల చనిపోయినట్లు వింటున్నాను) - నేనూ తగువులాడుకున్నాము. అతను నాకన్న పెద్దవాడై వుండి నేను ఒంటరిగా వున్నప్పుడు నన్ను కొట్టాడు. నేను అదును చూసుకుని, కొందరి జట్టు చేర్చుకుని, అతన్ని మళ్ళీ కొట్టి, కసి తీర్చుగున్నాను. అప్పట్లో