పుట:Naajeevitayatrat021599mbp.pdf/700

ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. ఆ మర్నాడు ఉదయం (27-7-46 న) మేము ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని బొంబాయి వెళ్ళాము. రమారమి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పటేలుగారిని చూడడానికి ఆయనఇంటికి పోయాము. మేము లోపలికి వెళ్ళి కూచున్నాము. కిటికిగుండా కొంత సూర్యరశ్మి మా మీద పడుతూంది. మేము కూచోగానే, పటేలుగారు చిన్న తుఫానులా మాట్లాడడం ఆరంభించారు.

"ఏ మయింది పట్టాభికి? మతి చెడిందా?" అని పటేలుగారు ప్రశ్నించగా, ప్రకాశంగారు ఆయనతోగూడా పట్టాభిగారి ఉపన్యాసం పత్రికలలో సరిగా పడలేదని చెప్పి, పట్టాభిగారు పత్రికలకు సవరణ పంపిన సంగతి చెప్పారు. అందుకు పటేలుగారు, "మొదట బొమ్మ పగలగొట్టేశాడు. ఇపు డాయన సవరిస్తే ఏమిలాభం? మేము అహమ్మద్ నగరు కోటలో ఉండగా, మామీద ఛార్జీషీట్లు వచ్చినపుడు పట్టాభిగారిని అడిగితే - ఇది గాంధీగారితో చర్చించి, వర్కింగ్ కమిటీవారు కూడా చర్చించిన తరువాతే తాను ప్రోగ్రాం వ్రాసినట్టు వాదించాడు. దానిపైన, వర్కింగ్ కమిటీ మెంబర్లెవరూ ఇటువంటి చర్చ జరిగినట్టు తమకు జ్ఞాపకం లేదన్నారు. కాని, ఆయన అలా జరిగినదని చెప్తూ, అందరి జ్ఞాపక శక్తికన్నా తనదే మేలైనదని వాదించసాగాడు. ఆ రోజులు మమ్మలందర్ని దక్షిణాఫ్రికాకు రవాణా చేస్తారని కింవదంతులతో నిండినరోజులు, ఎన్నాళ్ళలా ఆ జెయిలులో కలిసి ఉండవలసి వస్తుందో తెలియదు. ఎందుకు పరస్పర భేదాభిప్రాయాలు పెంచుకోవాలని అప్పటి మటుకు ఆయనతో వాదించడం మానివేశాము. తరువాత జెయిళ్ళలోంచి విడుదలయిన వెంటనే బొంబాయిలో వర్కింగ్‌కమిటీ మీటింగు జరిగింది. ఆ మీటింగులో ఈ ప్రసక్తి మళ్ళీ వచ్చింది. పట్టాభిగారు తనమాట తనదేనని కూచున్నారు. పోనీ, ఎందుకయినా మంచిది గాంధీగారి అభిప్రాయం కనుక్కొందామని శంకరరావుదేవ్ గారిని ఆయన దగ్గరకు పంపడం జరిగింది.

గాంధీగారు ఆయనను 'పట్టాభే ఈ విధంగా చెప్పాడా?' అని ప్రశ్నిస్తే, ఆయన అవునని జవాబిచ్చాడట. దానిపై గాంధీగారు