పుట:Naajeevitayatrat021599mbp.pdf/695

ఈ పుట ఆమోదించబడ్డది

స్థితులు ఎలా ఉంటాయో, సౌకర్యాలు ఎలా ఉంటాయో అన్న చర్చలో పడ్డాము. అంతలో పెద్ద వర్షం వచ్చింది. మా సామానుల కోసం రెండు లారీలు, మేము కూచోడానికి రెండు బస్సులూ వచ్చాయి. రాదనుకొని బస్సుకప్పుపైన పెట్టిన సామానులు కొన్ని వర్షంలో బాగా తడిసిపోయినాయి. అవి తిరిగీ సర్దేవరకు మేము కదలమన్నాము. చివరకు బయలుదేరిన బస్సులు నాగపూరు జెయిలు వైపు తిరుగలేదు. అవి ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియలేదు. పోలీసు ఉద్యోగులు అంతా, ఎంత అడిగినా తెలియదనే ఒక్కటే జవాబు చెప్పారు. చాలనందుకు, అడపా దడపా వర్షపు చికాకు. ఎలాగైతే నేమి, రాత్రి పదకొండు, పన్నెండుగంటల వేళకు ఏదో జెయిలుగేటు చేరుకున్నాము. ఇది యే ఊరు అని అడిగితే, అంతదాకా తెలియదంటూ వచ్చిన సార్జెంటు మొదటిసారిగా ఆ మాట వదలి, 'అమరావతి" జెయిలన్నాడు. మే మక్కడికి ఏ రాత్రికైనా వస్తామన్న సంగతి అక్కడి జెయిలు అధికారులకు తప్పకుండా తెలిసే ఉండాలి కదా! అయినా, ఒక అరగంట వరకూ ఎవరూ కనిపించలేదు. వర్షపు తుంపరలలోనే మేమంతా ఉండవలసి వచ్చింది. మాలో - సత్యమూర్తిగారు వర్షంలో చేసిన ఈ ప్రయాణాన్ని తట్టుకోలేక పోయారు. దాంతో ఆయనకు తీవ్రంగా జబ్బుచేసింది. నెలా రెండు నెలలపాటు ఆ జబ్బు ఉద్ధృతమయ్యేసరికి, వారిని చెన్నపట్నం జెయిలుద్వారా అక్కడి జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. పాపం, ఆయన అక్కడే స్వర్గస్థులయ్యారు. ఆ విధంగా బ్రిటిషువారి క్రౌర్యానికి ఆయన బలి అయిపోయారు.

ఈ అమరావతి జెయిలు వట్టి జిల్లా జెయిలు. అయినప్పటికీ దానికి రెండు ప్రాకారాలుండేవి. ప్రాకారపు గోడల ఎత్తు పదిహేను ఇరవై అడుగులకు తక్కువలేదు. లోపల, మా ముప్పైరెండుమందినీ ఒకచోట పెట్టడానికి విశాలమయిన భాగంకూడా లేదు. అందుచేత మాలో ఇరవై మందిని ఒక ఆవరణలోను, తక్కినవారిని మరొక ఆవరణలోను - ఎలెక్ట్రిక్ దీపాలుకూడా లేని జింకు కప్పులుగల