పుట:Naajeevitayatrat021599mbp.pdf/687

ఈ పుట ఆమోదించబడ్డది

కుతూహలం కలిగింది. నేనూ, అక్కడే ఏ.సి.సి, కంపెనీలో పనిచేస్తూ ఉన్న ముసలగంటి భీమారావు అనే మిత్రుడు, అలా బయలుదేరి మొదట వల్లభాయి పటేలు గారింటికి వెళ్ళాము. తలుపు తీస్తూనే పటేలు గారి కుమారుడు ఏదో రహస్యంగా జరుగుతున్నట్టు సూచించి, మమ్మల్ని గదిలో కూచోపెట్టి, లోపలినుంచి ఒక పెద్ద కాగితాల లట్ట తెచ్చి, అదంతా ఏక్షన్ కమిటీ ఆదేశమనీ, అందులో ఉన్నట్టు నడిపించమనీ మాతో చెప్పాడు. అందులో శుద్ధ శాబటేజ్ ప్రోగ్రామ్ వ్రాసి ఉంది. 'ఆంధ్రా సర్క్యులర్‌' అన్న పేరిట తర్వాత ఆంధ్రుల కమిటీపైన నేరాలుగా మోపిన విషయాలన్నీ అందులో ప్రోగ్రాం పేరిట వ్రాసి ఉన్నాయి. ఎవరీ ఏక్షన్ కమిటీ? అంతా మా మిత్రులే గనుక, "అబ్బాయ్! ఇదంతా గాంధీగారి ప్రోగ్రాముకు వ్యతిరేకం కాదా?" అని అడిగితే, "గాంధీగారు అరెస్టయిన తర్వాత ప్రోగ్రాం మనదే. ఆయనకేం సంబంధం?" అన్న మోస్తరుగా ఒకరితో ఒకరు అనుకున్నారు. ఏమయితే నేమి ప్రాణ హింసా రహితమైన శాబటేజ్ ప్రోగ్రాం దానంతట అదే పట్నంలో ప్రారంభమయింది. ఆ కాగితాల కట్ట తీసుకుని నేను, భీమారావు మేడదిగి, కొంచెం వెనక రోడ్డుకు వెళ్ళి ట్రామ్ ఎక్కాము. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం దాటేసరికి, ట్రాములు, బస్సులు అన్నీ ఆగిపోయి ఉన్నయ్యక్కడ. అది చూసి, ఏదో డబుల్ డెక్ బస్సు ఒకటి దాదరువైపు వెళుతూంటే అందులో పైకి ఎక్కాము. అందులో ముగ్గురు, నలుగురు తెల్లవాళ్ళున్నారు. ఇక బస్సు కదులుతుందనగా కండెక్టరు పైకి వచ్చి తెల్లవారిని దిగి పొమ్మన్నాడు. విప్లవం గట్టి పడుతోందని మాలో మేము సంతోషించాము. కాని, రెండు నిమిషాల తర్వాత ఆ తెల్లవాళ్ళు మళ్ళీ మీదికి వచ్చి కూచున్నారు. ఈ దిగడం, ఎక్కడం ఏమిటని వారిని మేము కుశల ప్రశ్న లడిగాము. అంతకు ముందు కొందరు తెల్ల వాళ్ళు ప్రజల మూకలు తమపై పడతాయేమో నన్న భయంతో దిగి పోవడంచేత, కండక్టరు తాము కూడా అట్లా చేస్తారేమో అని అడగ్గా, ఒకరు తప్ప తక్కిన వారు భయంలేదని తిరిగి వచ్చినట్టు చెప్పారు. అంత