పుట:Naajeevitayatrat021599mbp.pdf/685

ఈ పుట ఆమోదించబడ్డది

నట్టు చెప్పి, కాలకృత్యాలకు, స్నానపానాదులకు ఆయనకు ముప్పావు గంట వ్యవధి ఇచ్చామని చెప్పారు. పట్టాభిగారిని ఎక్కడికి తీసుకుపోతారో చెప్పడానికి వారు నిరాకరించారు. అయితే కొంతసేపటికి, ఆయనను విక్టోరియా టెర్మినెస్ రైల్వేస్టేషనుకు తీసుకు వెళతారని గ్రహించగలిగాను. వారు వెళ్ళేకారులోనే పట్టాభిగారితో బాటుగా నన్నూ విక్టోరియా టెర్మినస్ స్టేషను వరకైనా తీసుకు వెళ్ళవలసిందని ఆ పోలీసు ఉద్యోగిని అడిగితే, క్రింద సి.ఐ.డి. ఉన్నాడనీ, అందువల్ల అలా చేసే వీలులేదనీ అతడు చెప్పాడు. నేను క్రిందికి దిగి, ఆ సి.ఐ.డి. ని ఎలాగో ఒకలాగున ఒప్పించి, పట్టాభిగారు ఎక్కిన కారులోనే ముందుసీట్లో ఆ ఉద్యోగి ప్రక్కనే కూచుని, జయ జయ శబ్దసూచకమైన పక్షుల కలకలా రావాలతో తెలతెల వారుతూండగా విక్టోరియా టెర్మినస్ స్టేషను చేరుకున్నాను. ప్రత్యేకమైన ఒక ఫ్లాట్‌ఫారం మీద అప్పటికే అరెస్టయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొందరు తమకోసం ఏర్పాటైన ప్రత్యేకమైన రైలు ముందు నిలబడి ఉండడాన్ని దూరం నుంచి చూడగలిగాను.

అంతలో భళ్ళున తెల్లవారినది. నేను, గాంధీగారు మొదలైనవారు అరెస్టయిన వార్త - అక్కడికి దగ్గరగానే ఉన్న అమృతాంజనము భవనంలోనికి వెళ్ళి, అక్కడున్న ఆంధ్ర డెలిగేట్ల (ప్రతినిధుల) తోను, ఆ ప్రక్కనే ఉన్న హోటలులో ఉన్న పంజాబీ బంగాళ ప్రతినిధులతోను చెప్పి, తిరిగి గీర్గాంలో ఉన్న నాగేశ్వరరావుగారి బసకు మెల్లిగా బయలుదేరాను. విక్టోరియా టెర్మినసునుంచి గీర్గాంకు పోయేత్రోవ దోభీతలావు ద్వారా పోతుంది. నేను దోభీతలావుకు నడచి వెళ్ళేసరికి, వందల కొద్ది ప్రజలు అక్కడి ట్రాఫిక్ సర్కిల్ (అంటే - వెళ్ళే బండ్లు, వచ్చే బండ్లు విడివిడిగా పోవడానికి వీలుగా, చుట్టూ సిమెంట్ స్తంభాలకు ఇనుప గొలుసులు వేసి, వలయాకారంగా ఏర్పాటు చేసిన స్థలము) వద్ద ఆ స్తంభాలు, గొలుసులు ఊడబెరికి, ఏవేవో పాత పెట్టెలు, బల్లలు మొదలైన వాటిని గీర్గాం పోయే రహదారి ముందు అడ్డంగా పెట్టేసి, దాన్ని బందు చేసేశారు. వారు మను