పుట:Naajeevitayatrat021599mbp.pdf/682

ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్ పట్టాభిగారు మా అందరితోబాటు తిరుచినాపల్లి జైలులోగాక, వేలూరు జైలులో ఉండడం జరిగిందని మరొక చోట కూడా పేర్కొనడం జరిగింది. అప్పుడు అక్కడ ఆయనతో బాటు మరి కొందరు తెలుగు నాయకులుకూడా ఉండేవారు. వారిలో కళా వెంకటరావుగారు కూడా ఉండేవారు. ప్రకాశంగారిపై రాజాజీకున్న వ్యతిరేక భావంతోబాటు ఆయనపై పట్టాభి గారికి గల ప్రతికూల భావం కూడా ప్రకాశంగారి కార్యక్రమాలకు అడ్డం వచ్చేది. అందువల్లనే, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి వారు అధ్యక్షులయినా - పట్టాభిగారు తమ చెప్పు చేతల్లోకి కళా వెంకటరావు గారిని తీసుకోనారంభించారు. ప్రకాశంగారికి తెలియకుండానే, తాను కార్యదర్శ కావడంవల్ల ఆయన ఏవేవో పనులు చేయడం కూడా ఆరంభించారు. దీని పరిణామాలు రాబోయే మరొక అధ్యాయంలో వివరిస్తాను.

బొంబాయి ఏ.ఐ.సి.సి సమావేశము

బొంబాయిలో ఏ.ఐ.సి.సి. సమావేశం కాక పూర్వము ఒక రాత్రి నేను గుంటూరునుంచి విశాఖపట్నం వెళ్ళే త్రోవలో, విజయవాడ రైల్వే ప్లాట్‌ఫారం మీద సగం రాత్రప్పుడు కళా వెంకటరావు గారిని చూడడం జరిగింది. ఆయన నెల్లూరు నుంచి బందరు వెడుతూ, అక్కడ బందరు రైలుకోసం కనిపెట్టుకుని ఉన్నట్టు చెప్పాడు. బందరు కెందుకని నే నడిగాను. అక్కడ పట్టాభిగారి యింట్లో కాంగ్రెసు నాయకుల సమావేశం జరుగనున్నదని చెప్పాడు. "నాకు నోటీసు అందలేదే," అని నే నంటే, అది ఇన్‌ఫార్మల్ మీటింగు గనుక అందరికీ నోటీస్ ఇవ్వలేదనీ, అయినా నన్ను రమ్మనీ ఆహ్వానించాడు. "ఏమిటి విషయ?" మని నే నడిగాను. జేబులోంచి ఒక రోనియో టైపు చేసిన కార్యక్రమ సూచికను తీసి చూపించాడు. అది నేను చదివి, "ఇలాంటి దెక్కడిది? ఎవరిచ్చిం"దని అడగ్గా, అది డాక్టర్ పట్టాభిగారు గాంధీగారు ఇచ్చిన సూచనల మేరకు తయారుచేసిన కార్యక్రమం అని చెప్పాడు. అందులో టెలిగ్రాపు తీగలు టెలిఫోను తీగలు కత్తి