పుట:Naajeevitayatrat021599mbp.pdf/681

ఈ పుట ఆమోదించబడ్డది

మన మనసుల్లోంచి నిర్మూలించాలని ఒక బహిరంగ సభలో చెప్పారు. జూలై 25న, పాకిస్తాన్ కావాలని వాదించే కాంగ్రెసువారిని, కాంగ్రెసు నుంచి తొలగించవలసిన సమయంవచ్చిందని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి హెచ్చరిక చేశారు. అంతకు ముందు, జూలై 14 న వర్కింగ్ కమిటీవారు వార్ధాలో సమావేశమై, బ్రిటిషువారిని ఇండియాలోంచి వెళ్ళగొట్టడానికి జయం లభించేంతవరకు యత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ఏప్రిల్ చివర అలహాబాదులో జరిగిన ఎ.ఐ.సి.సి. సమావేశంలో పాకిస్తాన్ వాదియైన రాజాజీ ఐదునిముషాలు మాట్లాడడానికి కూడా సభ్యులు అనుమతించలేదు. అంతకు పూర్వమే, కాంగ్రెసు అధ్యక్షులు కాంగ్రెస్ కమిటీ లోంచి ఆయన పేరు తొలగించారు. చెన్నరాష్ట్రంలో అన్ని చోట్లా ప్రజలను ముందుకు నడిపే శక్తి ఒక్క ప్రకాశంగారిలోనే ఉన్నట్టు - అన్ని పక్షాల కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూండేవారు. కాంగ్రెస్ నాయకులలో పరస్పర భిన్నాభిప్రాయాల మాట అటుంచగా, 1941 జూన్ లో హిట్లర్ రష్యాపై దాడి చేసిన నాటినుంచి, రష్యావారిని సంతృప్తి పరచడం కోసమని, మన దేశంలో కమ్యూనిస్టులపైగల ఆంక్షలన్నీ ప్రభుత్వం వారు తొలగించడంతో - కాంగ్రెస్ నాయకత్వానికి వారు ఎదురు పక్షమయి, ప్రభుత్వాన్ని బలపరిచేందుకు సిద్ధపడ్డారు. కాని, ఏది యేమైనా దేశస్వాతంత్ర్యంకోసం, ప్రాణాలు బిగబట్టి, ముందుకు దూకవలసిన సమయం వచ్చింది. ఒక మారు దూకిన తరువాత, అందరూ స్వాతంత్ర్య పక్షవాదులు కాకతీరదనీ, అప్పుడు, అందరూ స్వాతంత్ర్య సమరానికి దోహదం చేయగలరనీ గాంధీగారి దృష్టి పథంలో గోచరించగా, ఆయన ఆగస్టు నెలలో 'క్విట్ ఇండియా' నినాదం చేశారు. దానికి కార్యరూపం ఇవ్వడానికి ఆగస్టు 6 నుంచి బొంబాయిలో ఎ.ఐ.సి.సి. సమావేశాలు ఏర్పాటయినవి. చిన్నచిన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తిగతంగా ఉన్నా, కాంగ్రెస్ వాదులందరికీ గాంధీగారు చెప్పిన కార్యక్రమంలో సంపూర్ణ విశ్వాసం ఉండేది. అందుచేత, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులైన ప్రకాశంగారి కార్యక్రమం సాఫీగానే సాగేది. వ్యక్తి సత్యాగ్రహ సమయంలో