పుట:Naajeevitayatrat021599mbp.pdf/680

ఈ పుట ఆమోదించబడ్డది

దేశాన్ని నాలుగు భాగాలుగా ఏర్పాటు చేసుకుని, ఒక్కొక్క భాగానికి ఒక ప్రాంతీయ రక్షణ సంఘం ఏర్పాటు కావాలని తీర్మానించడం జరిగింది. అదే సమయంలో బ్రిటిషు ప్రభుత్వం తరపున సర్ స్ట్రాఫర్డు క్రిప్స్ మార్చి 28 నాడు మన దేశానికి వచ్చారు. ఆయన రాక ఉద్దేశం: రాజ్యాంగంలో కొన్ని మార్పులుచేసి, భారతీయ నాయకులకు ప్రభుత్వంలో కొంత చోటివ్వడం వల్లనో, ఇంకొకలాగునో బ్రిటిషు ప్రభుత్వాన్ని ఇక్కడ శాశ్వతంగా ఉండేటట్లు చేయడమే. ఆయన ఇక్కడ ఉండగానే, ఏప్రిల్ 6 న జపాన్ వైమానికులు పది, పన్నెండు విమానాలలో వచ్చి, విశాఖపట్నం పైనా, కాకినాడపైనా బాంబులువేసి, కొంత ప్రాణనష్టాన్ని, వస్తు నష్టాన్ని కలగజేశారు.

ఇది ఇలా ఉండగా, ప్రకాశంగారు ఎప్పటికప్పుడే, రాజాజీ చెప్పినట్లుగా దేశాన్ని ఖండించ రాదని, ఆయన వాదాన్ని ఖండిస్తూ చెన్నపట్నంలోనూ, మిగిలినచోట్లనూ ప్రచారం చేస్తూండే వారు. ఇంతలో ఏప్రిల్ 29 నుంచి, మే 22 దాకా అలహాబాదులో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశ మయింది. అప్పుడు గాంధీజీ ఒక సూచన చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే. స్వతంత్ర భారతదేశ ప్రభుత్వము వారు మిత్రరాజ్య సైన్యాలు యుద్ధం కొనసాగించడానికి అనుమతించ గలరని ఆ సూచనలోని భావం. 2-6-42 న చెన్నపట్నంలోని ఆర్యసమాజ భవనంలో రాజాజీ చేసిన పాకిస్తాన్ ప్రతిపాదన కొద్ది కాలంలోనే దానంతట అదే నశిస్తుందని ఆశించారు. 26-2-42 న ప్రకాశంగారు తిరిగి కాంగ్రెస్ వాదులలో ఐకమత్యం, మనో దృఢత్వం కలగడానికి - అఖిల భారత కాంగ్రెస్ కమిటీవారు ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించ వలసిందని ఆదేశించారు. వ్యక్తిగతమైన వాదనలు, విజృంభణలు చేయకుండా ఏకైక నాయకుడైన గాంధీగారి ఆదేశం ప్రకారం కాంగ్రెస్‌వారు యావన్మందీ నడచుకోవాలే కాని, స్థిర బుద్ధిలేని ఉపనాయకుల ఊపులకు లొంగకూడదని కూడా ఆయన గట్టిగా హెచ్చరిస్తూ వచ్చారు. 27-6-42 న చెన్నపట్నంలో - పాకిస్తాన్ ఇవ్వాలనే అభిప్రాయాన్ని సమూలంగా