పుట:Naajeevitayatrat021599mbp.pdf/679

ఈ పుట ఆమోదించబడ్డది

రాష్ట్రం ఏర్పాటు చేయనని ప్రధానమంత్రి కఠినంగా చెబుతూ వచ్చారు. చివరకు, 1953 వేసవికాలం తరువాత చెన్నపట్నం, బళ్ళారి మినహాయించి, మిగిలిన తెలుగు ప్రదేశాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి నెహ్రూగారు అంగీకరించడం, సెప్టంబరు నెలలో ఈ విషయమై ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు కావడం, అక్టోబరు 1 నాడు నూతనాంధ్ర రాష్ట్రానికి కర్నూలులో నెహ్రూగారే ప్రారంభోత్సవం జరిపించడం మొదలైన విషయాలు ముందు వివరిస్తాను. ఇక్కడ, ఆంధ్రరాష్ట్ర అవతరణ విషయం క్లుప్తంగా చెప్పడమైనది.

10

క్విట్ ఇండియా ఉద్యమము

వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం అనంతరం ఆగస్టు నెలవరకు కొంత విరామం కలిగింది. వ్యక్తి సత్యాగ్రహంలో కాంగ్రెస్ వాదులు చూపించిన క్రమశిక్షణ, కార్యదీక్ష దేశంలో నూతనోత్సాహాన్ని కల్పించాయి. జైలునుంచి విడుదలయిన తర్వాత రాజాజీ చేసిన పాకిస్తాన్ పక్ష ప్రచారానికి వ్యతిరేకంగా సమగ్ర జాతీయవాదం - కేవలం కాంగ్రెసు వాదులలోనేగాక, ఎలాగో ఒకలాగు నిత్య జీవితాలను వెళ్ళబుచ్చే సామాన్య ప్రజలలోకూడా ప్రబలమైంది. ఇంతలో, 1941 డిసెంబరులో విడుదల కాకుండా మిగిలిన సత్యాగ్రహు లందరినీ జైళ్ళనుంచి విడుదల చేశారు. ఆ నెల ఆఖరున బార్డోలీలో, కాంగ్రెస్ కమిటీవారు మరొకసారి గాంధీగారితో భిన్నాభిప్రాయులై, కొత్త ఆలోచనకు దిగడం జరిగింది. అయితే, దేశ రక్షణకోసం ప్రభుత్వంతో సంబంధం లేకుండా రక్షణ సంబంధాలు ఏర్పాటుచేసే ఊహలుకూడా కలిగాయి. 1942 మార్చిలో ప్రకాశంగారి అధ్యక్షతన బెజవాడలో ఆంధ్రరాష్ట్ర కార్యసంఘం సమావేశమయింది. బ్రిటిషువారు మన దేశాన్ని రక్షించగల స్థితిలో లేరన్న భావం ఒకటి ఏర్పడి, ఆంధ్ర