పుట:Naajeevitayatrat021599mbp.pdf/675

ఈ పుట ఆమోదించబడ్డది

కాబినెట్ మీటింగులో ఏమి చేయగలమో ఆలోచించాలి. ప్రజల మనసులో ప్రత్యేకాంధ్రరాష్ట్ర వాంఛ బలంగా ఉంది," అని వ్రాశారు. దానిపైన రాజాజీ "ఇంకా ఏం చేయాలి?" అన్న మాట కలిపారు. అంటే చేసేదేమీ లేదని ఆయన భావము. 14-7-38 న ఇండియా కార్యదర్శి నుంచి చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం వచ్చింది. 11/F, 18/53/38-జీ.పి. - 7 మే, 7 జూలై తేదీలలో వీరు వ్రాసిన ఉత్తరాలు, వాటితో పొందుపరచిన మార్చి 30, 31 తేదీల శాసన సభా మండలి తీర్మానాలు పంపిస్తూ, చెన్నరాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు అందినట్టూ, అయితే వీరు వ్రాసిన మొదటి ఉత్తరం అందిన తర్వాత హవుస్ ఆఫ్ కామన్స్‌లో ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చే సందర్భంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయమై బ్రిటిషువారి అభిప్రాయం వివరించడం జరిగిందనీ, ఆ జవాబు దీంతోబాటు పంపుతున్నామనీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు భారత దేశానికి మంచిది అన్న వీరి అభిప్రాయంతో ఏకీభవించ లేనందుకు చింతిస్తున్నట్టూ వ్రాశారు. ఇది జరిగిన పిదప, చెన్నరాష్ట్రం కాబినెట్‌లో మరొక విషయం జరిగింది. తెలుగు జిల్లాలకు ప్రత్యేక పరిపాలనా యంత్రం, మిగిలిన జిల్లాలకు వేరే పరిపాలనా యంత్రం ఏర్పాటుచేసి, ఈ రెండింటికి తానే గవర్నరుగా ఉండి కార్యకలాపాలు నడిపిస్తాననే ఎర్‌స్కిన్‌గారి అభిప్రాయం చర్చింప బడడమూ, అలా కావాలనే కాబినెట్ ఒక తీర్మానం వ్రాసిందనే విషయమూ, అది ఇండియా కార్యదర్శికి పంపబడిన విషయమూ దేశంలో అందరికీ తెలిసింది.

1941 డిసెంబరులో జైలునుంచి వచ్చిన ప్రకాశంగారు విశాఖ ఆంధ్ర మహాసభలో బాంబువంటి ఒక మాట బయలుపెట్టారు. అప్పుడు అలా పంపిన ఆ విషయానికి చెన్నరాష్ట్రంలో అధికారం గల పెద్దలు కొందరే వ్యతిరేకులై, ఇండియా కార్యదర్శికి అధికార రీత్యా ఉత్తరం వ్రాయడంచేతే ఆ కార్యదర్శి ఏ పనీ చేయలేదని వెల్లడించారు. ప్రకాశంగారు ఎవరి పేరూ చెప్పకున్నా, అలా చేసింది రాజాజీ అని అర్థం చేసు