పుట:Naajeevitayatrat021599mbp.pdf/674

ఈ పుట ఆమోదించబడ్డది

జేయవలసిందిగా కోరుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ తీర్మానం పంపబడింది. ఆ సమయంలో చెన్నరాష్ట్ర ప్రభుత్వంవారు వ్రాసిన ఉత్తరంలో - అన్ని పరిస్థితులు అవగాహన లోనికి తెచ్చుకుని గవర్నమెంటువారు చెన్నరాష్ట్రాన్ని భాషాప్రాంతాలనే ప్రత్యేక పరిపాలనా రాష్ట్రాల క్రింద విభజించవలెనన్న సూత్రం ప్రభుత్వం అంగీకరిస్తున్నదని వ్రాశారు. అయితే ఇంగ్లండులో హౌస్ ఆఫ్ కామన్స్ సభలో కేరి అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇండియా కార్యదర్శి, ఇలా చెప్పాడు: "ఇండియాలో రాష్ట్రాలన్నీ భాషాప్రయుక్తంగా నిర్మాణం కావాలన్న కోరిక ఇండియాలో కలదని బ్రిటిషు గవర్నమెంటుకు తెలుసు." దానిపైన ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా కొత్తరాష్ట్రం ఏర్పాటుచేసే అధికారం చక్రవర్తిదని చెప్పారు. అంతేకాక, ఇండియా కార్యదర్శియైన జెట్‌రెండ్ అప్పట్లో నూతనంగా రాష్ట్ర విభజన, పునర్నిర్మాణం జరగడం ఇండియాకు మంచిది కాదని బ్రిటిషువారి అభిప్రాయం అని చెప్పారు. కామన్స్ సభలో యిచ్చిన యీ జవాబులు డిల్లీ గవర్నమెంటుకు చేరి, అక్కడినుంచి చెన్న రాష్ట్రపు గవర్నమెంటుకు అందగా, ఆ ఫైలుపైన 21-5-1938 నాడు రాజాజీ, "ప్రస్తుతం దీనిపై మనం చేయగల్గినదేమైనా ఉందా? ఇండియా కార్యదర్శి యిచ్చిన ప్రకటన వల్ల మనం వెనుకకు తగ్గవలసిన అవసరం లేదు. నాకు ముందడుగు వేయాలని ఉన్నది," అని వ్రాశారు. దానిపై 26-5-38 న గవర్నరు ఎర్‌స్కిన్ తన అభిప్రాయం వ్రాస్తూ, "ఏప్రిల్ 21 నాటి పదవ నెంబరుగల ఉత్తరం ద్వారా ఇండియా కార్యదర్శికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మన శాసన సభా, శాసన మండలి తీర్మానాలను పంపారు. ఇండియా కార్యదర్శి ప్రత్యుత్తరం వచ్చే వరకు వేరేపని చేయడం నిలుపుల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇండియా కార్యదర్శిని ఈ క్షణంలో జాబులతో బాంబు చేయడంవల్ల ప్రయోజనం లేదు," అని వ్రాశారు.

ఇలా ఉండగా, ప్రకాశంగారు బందరు వెళ్ళినప్పుడు అక్కడి మునిసిపాలటీవారు ఆయనకొక స్వాగత పత్రం ఇచ్చారు. అందులో ఆంధ్రరాష్ట్ర ప్రసక్తి ఉంది. దానిపై 5-8-38 న ప్రకాశంగారు "రాబోయే