ఈ పుట ఆమోదించబడ్డది

మా ముఠాలోనించీ, "ఊరేగితే తంతాము" అనే ప్రగల్భాలు వాళ్ళ ముఠాలోనించీ బయలుదేరాయి.

ఇల్లా వుండగా నాలుగయిదురోజుల్లో దేవుడి ఊరేగింపు వచ్చింది. ఆ ఊరేగింపులోకి మేము కొందరం తయారయ్యాము. తాడి వెంకటరత్నం ధీమాకబుర్లవల్ల మేము ఎదటివాళ్ళ బెదిరింపులు లక్ష్యపెట్టలేదు. ఉత్సవం కాకినాడ బజారు దగ్గిర మసీదుదాకా వచ్చింది. అంతవరకూ ఏ గంద్రగోళమూ రాలేదు. "ఇంక ఇంటికి వెళ్ళిపోదా" మని అనుకుంటూ వుండగా ఆ ఎదటనించి 'ఘల్లుఘల్లు' మని గొలుసు చప్పుడు చేసుకుంటూ అబ్బాయి స్వయంగా మా మీదికి వచ్చాడు. అతని చేతుల్లో చెయ్యెత్తు బాణాకర్ర ప్రత్యక్ష మయింది. ఆ కర్రకి ఆ చివరనించి ఈ చివరిదాకా ఒకే గొలుసు! మనిషి తన ముఠాతో కేవలం కాలాంతకుడులాగ వచ్చి పడ్డాడు. పడుతూనే వస్తాద్ తాడి వెంకటరత్నాన్ని ఒక దెబ్బ తీశాడు! దాంతో పక్కని నిలబడ్డ నాకే గీరెత్తింది! తాడి వెంకటరత్నానికి నఖశిఖపర్యంతమూ దెబ్బతగిలింది! అబ్బాయి, ఆ తరవాత తాడి వెంకటరత్నానికి, ముమ్మడి వెంకటరత్నానికీ కూడా తగిలేటట్లుగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఇది ఎందుకు ఇంత వివరంగా వ్రాస్తున్నానంటే - ఆ నాడు అబ్బాయి పోరాటపుచాకచక్యాన్ని వుదహరించడానికే! ఆతని నేర్పు, సాహసమూ అత్యద్భుతంగా వుండేవి. దెబ్బ కొట్టడంలో మంచి శాస్త్రోక్తంగా కొట్టాడు. మూడో దెబ్బ తగిలే సరికి ఇంత బలమైన మనిషీ ఒక్కసారిగా, కాలికి బుద్ధి చెప్పాడు!

అప్పటి కింకా తాలింఖానాల్లో దెబ్బ నేర్పుగా కొట్టడమూ, ఎదుటివాళ్ళు కొట్టేటప్పుడు ఒడుపుగా తప్పుకోవడమూ, నేర్పుతూ వుండేవారు. ఇంగ్లీషురాజ్యం వచ్చి అప్పటికి కొంచెం కాలమే అవడంచేత జాతిలో యింకా ఆ విషయంలో ప్రావీణ్యం మిగిలే వుంది. సింగితం అబ్బాయి ఆ రోజున మా జనంమీద వీరవిహారం చేశాడు. నాతోకూడా వుండిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే మా ప్రధాననటకుడికి తల పగిలిపోయి మెదడు బయటపడింది. నాకు చేతులమీదా,