పుట:Naajeevitayatrat021599mbp.pdf/659

ఈ పుట ఆమోదించబడ్డది

లేదు కదా?" అన్నారు. తర్వాత ఆ నెల 28 న గాంధీగారు వైస్రాయిని సందర్శించారు. అప్పటి కప్పుడే 'వ్యక్తి సత్యాగ్రహం' అనే ఒక కొత్త ప్రక్రియ గాంధీగారి పదకోశంలో రూపొందటం ఆరంభించింది.

ఈ పూనా సమావేశం అయిన తరువాత, 18-10-40 నాడు ప్రకాశంగారు అనంతపురం బహిరంగ సభలో వ్యక్తి సత్యాగ్రహ ప్రక్రియా వివరాలు, దాని ప్రభావంగురించి గంభీరోపన్యాసం గావించారు.

అంతకుముందు రోజే, గాంధిగారు ఈ వ్యక్తి సత్యాగ్రహం అన్నది వినోబాభావే గారితో ప్రారంభిస్తామని ప్రకటించేసరికి, జవహర్లాల్ నెహ్రూ ప్రభృతులకు కోపం వచ్చింది. అది విప్లవం తేగలిగే ఉద్యమమే అయినట్లయితే అటువంటిదానికి తమకు అగ్రతాంబూలం ఇవ్వాలంటూ - "ఎవరీ వినోబా భావే?" అని ప్రశ్నించారు.

"ఆయన సత్యా హింసలలో సంపూర్ణమయిన విశ్వాసం కలవ్యక్తి. నాతోనే ఆశ్రమంలో ఉండంవల్ల ఇతని పేరు పైకిరాలేదు. కాని, నేను తలపెట్టిన వ్యక్తి సత్యాగ్రహానికి ఆయనే తగిన వా"డని గాంధిగారు జవాబిచ్చారు. అంతేగాక, ఆ సత్యాగ్రహానికి నాయకత్వాన్ని తన ఒక్కరి చేతిలోనే ఉంచుకోవాలని గాంధిగారు నిర్ణయించారు. తాము చెప్పినవారే దేశంలో వ్యక్తి సత్యాగ్రహం చేయాలన్నారు. మొదట కొందరు అగ్రనాయకులు, వారి తరువాత కేంద్ర రాష్ట్ర శాసన సభలలోని కాంగ్రెస్ సభ్యులు, ఆపైన దేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ బోర్డు మొదలైన స్థానిక సంస్థల అధ్యక్షులు ఈ సత్యాగ్రహంలో పాల్గొనవలసిందని ఆయన ఏర్పాటు చేశారు. రాష్ట్రాలనుంచి పంపిన పేర్ల వరుసలను ఆయన అనుమతించిన తరువాతే సత్యాగ్రహంలో పాల్గొనవలసి ఉండేది.

ఈ విశాల భారతదేశ మంతటికీ ఏకైక నాయకుడుగా ఆయన చెప్పినట్టు సత్యాగ్రహులు దేశం మారు మూలలనుంచి ఒక క్రమశిక్షణతో రావడం అన్నది గొప్ప విప్లవాత్మకమైన, రాజకీయోద్యమ