పుట:Naajeevitayatrat021599mbp.pdf/654

ఈ పుట ఆమోదించబడ్డది

తుంది? వెంటనే రాజీనామా చేయకపోతే కాంగ్రెసు నీతికి భంగంగా ఎన్నెన్నో ఆర్డర్లు మన మంత్రివర్గంవారు చేయవలసి వచ్చేది.

ప్రకాశంగారి కాంగ్రెసు ప్రచారము

రాజీనామా ఇచ్చిన వెంటనే ప్రకాశంగారు తిరిగి కాంగ్రెస్ పని చేయడంలో నిమగ్ను లయ్యారు. 1937 లో ప్రకాశంగారు మంత్రి అయిన తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారికి అప్పజెప్పారు. ప్రకాశంగారు రాజీనామాచేసి రాగానే సీతారామయ్యగారు, రాష్ట్ర కాంగ్రెస్ సంఘపు అధ్యక్ష పదవిని ప్రకాశంగారికి సురక్షితంగా అప్పజెప్పారు. అప్పటికి కాంగ్రెసులో తీవ్రమైన అడ్డు కెరటాలు పుట్టలేదు.

ప్రకాశంగారు ఆ తర్వాత తెలుగు ప్రాంతాలలో మూల మూలలకు ప్రయాణం చేస్తూ - కాంగ్రెసు మంత్రివర్గ పాలనలో జరిగిన లోపాలను ప్రజలలో ఎవరైనా విమర్శిస్తే పరిపాలనను సమర్థిస్తూ, జమీందారీ బిల్లు మొదలయిన బిల్లు లెందుకు ఆలస్యమైనవో బోధపరుస్తూ మంత్రివర్గం ఏ కారణంచేత రాజీనామా ఇవ్వవలసి వచ్చినదీ వివరిస్తూ గంభీరోపన్యాసాలిస్తూ రాష్ట్రంలో పర్యటన చేశారు. 1941 జనవరిలో నూజివీడులో జరిగిన రాష్ట్ర రాజకీయ సభకు ప్రకాశంగారే అధ్యక్షత వహించారు. స్వాతంత్ర్య సమరం గూర్చి మాట్లాడి, గ్రామస్వరాజ్యము, ఖద్దరు ప్రాముఖ్యము, హరిజనోద్ధరణము మొదలైన విషయాలపై ఆయన గంభీరోపన్యాసాలు చేశారు.

ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరొకసారి సమావేశమై, రాష్ట్రాలలో కాంగ్రెస్ మంత్రివర్గాలు తిరిగీ స్థాపించే ప్రసక్తి వదలుకుని, గాంధీగారి నాయకత్వాన సంపూర్ణంగా బలపడడానికి తీర్మానించుకున్నారు. మార్చిలో బీహారు రాష్ట్రంలోని రామ్‌ఘర్‌వద్ద అఖిల భారత కాంగ్రెస్ సాంవత్సరిక మహాసభ జరిగింది. సభ జరగడానికి ఏర్పాటయిన స్థలం చిన్న అడవి వంటిది. చాలా చెట్లను కొట్టి, కాంగ్రెస్‌కు వచ్చిన వారికి వసతులూ, సభా స్థలమూ ఏర్పాటు చేశారు. అసలు