పుట:Naajeevitayatrat021599mbp.pdf/652

ఈ పుట ఆమోదించబడ్డది

సరిగా గ్రహించ లేకపోయా"రని ప్రకాశంగారు అంటే, శాసనమండలి సభ్యులైన సర్ కె. వి. రెడ్డినాయుడు గారు అందుకుని, "ప్రీవీ కౌన్సిల్ వారంతా ఇంగ్లీషువారు కదా! వారి ఇంగ్లీషు వారికే బోధపడలేదంటారా?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించారు. వెంటనే ప్రకాశంగారు "అంతే! రెడ్డినాయుడుగారికి తెలుగు గ్రంథాలన్నీ అర్థమయ్యాయా?" అని ప్రశ్నించారు.

రెడ్డినాయుడుగారు, ప్రకాశంగారు చిన్నప్పుడు కలసి చదువుకున్న వాళ్ళు (క్లాస్‌మేట్స్). మొత్తంపైన ఆ రెండేళ్ళున్నర మంత్రివర్గ కాలంలో ప్రకాశంగారు ఏది మాట్లాడినా, దానికి ఒక విలువ, ఒక బరువు ఉండేవి. అందుకు ఆయన త్యాగశీలత ముఖ్యకారణము.

7

మంత్రివర్గాల రాజీనామా

కాంగ్రెసు మంత్రివర్గాలు చురుగ్గానో, మందకొడిగానో కొన్ని కార్యకలాపాలు సాగించుకుంటూ వస్తూన్న రోజులలో యూరపు ఖండంలో ఒక మహాయుద్ధం ప్రారంభమైంది. ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరం శాంతి సంప్రదింపుల మిషపైన ఓడిపోయిన జర్మనీని గెలిచినవారు అణగద్రొక్కగా, జర్మనీ ప్రజల హృదయాలలో ఉడుకు కలిగి, దూరదృష్టిలేని ఒక నాయకుని ఉద్ధతివల్ల ఈ యుద్ధం ఆరంభమయింది. జర్మనీవారు తమకు - ఇంగ్లండు, ఫ్రాంసు, అమెరికా వారు ముఖ్య శత్రువులనే భావం పెంచుకున్నారు. ఒక లంఘింపుతో హిట్లరు, ప్రక్కనున్న చిన్నదేశాల నాక్రమించుకుని, యుద్ధ భేరీ మ్రోగించాడు. ఇంగ్లండుపై యుద్ధం ప్రకటించాడు. మన దేశానికీ జర్మనీకి మధ్య యుద్ధానికి ఏ విధమైన కారణమూ లేదు. కాని మనదేశం ఈ యుద్ధంలో తమకు సాయం చేయాలని ఇంగ్లండు పాలకుల వాంఛ. గాంధీగారేమో అసలు అహింసావాది. యుద్ధ విముఖుడు.