పుట:Naajeevitayatrat021599mbp.pdf/646

ఈ పుట ఆమోదించబడ్డది

కేకలు వేయడమే పెద్ద ఉద్యమంగా సాగించారు. రాజాజీ ఉండే యిల్లు చాలా చిన్నది. ఇంటికీ, వీథికీ మధ్య పది అడుగులకన్నా తక్కువ దూరం ఉండేది. అందుచేత ఆయనకు దుర్భర మయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీథిలో ఆ చివర, ఈ చివర పోలీసులను పెట్టుకుని కాలక్షేపం చేయవలసి వచ్చింది. ప్రజలమధ్యకు వచ్చి ప్రచారం చేసి, కాబినెట్ లోని మంత్రులందరి సలహాకూడా పుచ్చుకుని, ఒక వాతావరణం కల్పించిన తరువాత, అన్ని స్కూళ్ళలోను హిందీని ప్రవేశపెట్టి ఉన్నట్లయితే - అప్పుడు కాంగ్రెసువారికున్న పలుకుబడితో మంచి వాతావరణం ఏర్పడేది. కాని, ఈ అల్లర్లవల్ల, అది ముందుకు సాగలేదు. స్కూళ్ళలో కాకపోయినా, దక్షిణ భారత హిందీ ప్రచార సభవారు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలలో వందలు, వేలు హిందీపరీక్షలు పాస్ అవుతూనే ఉన్నారు. దాక్షిణాత్యులు బ్రతక నేర్చినవారు గనుక ఈ మధ్య హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను బలపరచినట్లు కనిపించినా కేంద్రప్రభుత్వపు ఉద్యోగులకు ప్రమోషన్లు వగయిరాలకు హిందీ అవసరం గనుక వాటికి భంగంలేకుండా వారు హిందీ నేర్చుకుంటూనే ఉన్నారు.

అయినా, హిందీ ఒక గడ్డు సమస్య అయిపోయింది. భాష నేర్చుకోవాలని పెద్దలు చెప్పినంతకాలం హిందీకి ఎవరూ అడ్డురాలేదు. కాని, ఎప్పుడయితే హిందీరాకుంటే ఉద్యోగానికి భంగం వస్తుందని ప్రభుత్వంవారు అన్ననాటినుంచి హిందీపై తగని వ్యతిరేకత ప్రబలుతూ ఉంది. హిందీరానివారికి ఏ విధంగా రాజ్యపరిపాలనాదక్షత తక్కువ కాగలదు? దేశంలో ఈ విషయమై అల్లర్లు, పోలీస్ లాటీచార్జీలు, కాల్పులు అన్నీ జరిగిన తరువాత మనప్రాంతంవారు - ఇక మనకు ఇంగ్లీషు వద్దు అన్నంతవరకు, హిందీతోబాటు ఇంగ్లీషు కూడా పూర్వంలాగే రాజభాషగా ఉండాలనే శాసనంచేసిన విషయం అందరికీ గుర్తుండ వచ్చును. అయినా, కేంద్ర సర్వీసులలో హిందీపరీక్ష పాసుకాకపోతే జీతం హెచ్చింపులు, ప్రమోషన్లు నిలుపుదల అవుతాయన్న ప్రభుత్వ ప్రకటనలు, సూచనా పత్రాలు (నోటిఫికేషన్స్) ఇప్పటికీ