పుట:Naajeevitayatrat021599mbp.pdf/625

ఈ పుట ఆమోదించబడ్డది

హృదయాలలో పెంచుకొన్నారు. ఒక రోజు సభలో ధైర్యం తెచ్చుకొని ఈ ప్రార్థనకు అభ్యంతరం చెప్పారు. కాంగ్రెసుకు వ్యతిరేకమైన పత్రికల వారా ఉప్పు అందుకొని, వారికి తోచినట్టు వారు వ్రాయడం మొదలు పెట్టారు. చివరకు సాంబమూర్తిగారు శాసన సభ ఆరంభం కావడానికి ఐదు నిమిషాల ముందువచ్చి, "ఇష్ట మున్నవారు పాల్గొనవచ్చు; లేనివారు వద్దు," అనే ఒక ఏర్పాటు కూడా చేశారు. ఇది అక్కడితో ఆగిపోయిందని మేము అనుకొన్నాము. కొంచెం లొంగుబాటు కనిపిస్తే ఎదురు పక్షంవారు ఊరుకోరు గద! ఆ గీతం శాసన సభా మందిరంలోనే పాడకూడదని అభ్యంతర పెట్టారు. దానిపైన సాంబమూర్తిగారు సర్వమత సామరస్యంగా ఉండే ఒక ప్రార్థన తామే వ్రాసి, ఒక రోజున సభా ప్రారంభంలో చదివారు. అది ఇది:

"అనంతమై సర్వశక్తిమంతమైన ఓ దేవా! చెన్నరాష్ట్ర ప్రజాప్రతినిధులమైన మేము శాసన సభయందు సమావేశమై, నిండు మనములతో ప్రార్థించు చున్నాము. మా హృదయముల నుండి రాగద్వేషములు అంతరించు గాక! మా మనస్సులు సర్వ జనోపయోగకరమైన సిద్ధాంతములను చేయుటయందు నిమగ్నమై ఉండుగాక! తద్వ్యతిరిక్త భావములు మాకు రాకుండా ఉండుగాక! మేము నిర్మించు శాసనములు, మేము ఆమోదించు తీర్మానములు జ్ఞాన యుక్తములై, హేతు సమర్థములై యుండుగాక! సత్యమును, న్యాయమును వాటికి ఆధారములగు గాక! అని ప్రజల ఆరోగ్య సౌభాగ్యములను వృద్ధిపరచుగాక! మాతృదేశ సేవయందు మా బుద్ధి స్థిరమైయుండి, శాంతి, స్వాతంత్ర్య సంపాదనకు మా సర్వశక్తులు వినియోగమగు గాక! ఓం శాంతి: శాంతి శాంతి:."

సభ్యులంతా విధిగా నిల్చుచున్నారే కాని, ఎదురు పక్షంవారు అదికూడా కాంగ్రెస్‌ వారికి లొంగిపోయినట్లు అయిందని తిరిగి కొంత