పుట:Naajeevitayatrat021599mbp.pdf/621

ఈ పుట ఆమోదించబడ్డది

కుంటాయనీ, అసలది ముఖ్యమంత్రికే మంచిది కాదన్నారుట. గవర్నరు సాంబమూర్తిగారు చెప్పినది బాగుందని అలాగే కానిమ్మన్నారుట.

సాంబమూర్తి గారు ఈ విషయా లన్నీ నాతో చెప్పి, "నేను ప్రకాశంగారి కింకా ఈ విషయాలు చెప్పలేదు. నీవు వెంటనే వెళ్ళి చెప్పిరా. నేను తర్వాత మాట్లాడుతాను" అని చెప్పారు. ముఖ్యమంత్రికి అంతకాలంగా ప్రకాశంగారితో మాటలు లేకపోయినా, ఆనాడు స్వయంగా ప్రకాశంగారి దగ్గరకు వెళ్ళి, నివేదికను ఆపుచేయ కూడదా అని అడిగినట్టూ, ఆయన దానిని సహజంగానే నిరాకరించినట్టూ నాకు తర్వాత తెలిసింది. వారు నిరాకరించిన తర్వాత స్పీకరును ఉపయోగించి నివేదికను ఆపడానికి యత్నించడం పార్లమెంటరీ విధానానికి అపకృతి. అంతకన్నా కూడా ప్రజాస్వామ్యానికి హెచ్చు అపకృతి - ఈ విషయంలో గవర్నరుగారిని కూడా రంగంలోకి దించటం

నేను ప్రకాశంగారి వద్దకు వెంటనే వెళ్ళి, సాంబమూర్తి గారు చెప్పినదంతా యథాతథంగా చెప్పగా, ఆయన "అవునులే! ఈ దేశంలో అన్ని వ్యవహారాలూ తలక్రిందులుగానే జరుగుతాయి!" అన్నారు.

ఆ రోజున నివేదిక ఇచ్చినపుడే రాబోయె జనవరి 20 వ తేదీన శాసన సభలో దానిని చర్చించే సమయమని నిర్ణయం జరిగింది. ఇలా ఉంటూండగా, కొద్ది రోజులలో ప్రశ్నోత్తర సమయంలో ఈ కమిటీ విషయం వచ్చింది. ప్రశ్నోత్తర సమయాలలో ప్రకాశంగారి తరపున నేనే - రెండు మూడు సమయాల్లో తప్ప, ఎప్పుడూ జవాబులు చెప్పడం జరిగేది. ఆ ప్రశ్న వచ్చినపుడు, నేను దానికి జవాబుగా, రిపోర్టు శాసన సభకు అందించడమైనదని, జనవరి 20 వ నాడు జరిగే చర్చపై శాసన సభవారు చేసే తీర్మానాన్ని బట్టి శాసనం ఎప్పుడు ఎలా చేసేది తెలుస్తుంది అనీ అన్నాను.

ముఖ్యమంత్రిగారు వెంటనే నా చేయి తట్టి, "అలా జవాబు చెప్పవద్దు. గవర్నమెంటు వారు నిర్ణయిస్తారని చెప్పు," అన్నారు.

ఇంతట్లో సప్లిమెంటరీగా అనుబంధ ప్రశ్న వచ్చింది. నేను